Nizamabad: జీజీహెచ్‌లో మూడేళ్ల బాలుడు కిడ్నాప్

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు..

Update: 2024-07-20 04:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మాక్లూర్ మండలం మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆస్పత్రిలోని కారిడార్‌లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన బాలుడి తండ్రి తన పక్కలో పడుకున్న కొడుకు కనిపించక పోయేసరికి ఆందోళనకు గురై ఆస్పత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించక పోవడంతో తన కొడుకు కిడ్నాప్‌కు గురైనట్లు గ్రహించి ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఒకటో టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఆస్పత్రిలోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎటువైపు తీసుకెళ్ళారనే విషయాన్ని తెలుసుకోడానికి ఆస్పత్రి పరిసరాల్లో, బస్టాండు, నగరంలోని ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

గతంలో కూడా జీజీహెచ్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్‌కు గురైన వారిని ట్రేస్ అవుట్ చేసి, నిందితులను కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కూడా పోలీసుల సామర్థ్యంపైనే బాధిత తల్లిదండ్రులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆస్పత్రిలో రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News