Monkeys : వానర సైన్యం.. డోర్లు తెరచి ఉంటే అంతే సంగతి..
ఆరు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి పాదాచారులది.
దిశ, భిక్కనూరు : ఆరు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి పాదాచారులది. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో కోతుల ( Monkeys ) సైన్యం ఇండ్ల పై కప్పుల పై తిరగడం, వాటంతల అవే కొట్లాడుతూ దారిని వెళ్తున్న వారిని వెంటబడి కరుస్తున్నాయి. దీంతో చాలామంది భయపడిపోతున్నారు. చేతిలోకి కట్టె గాని ఏదైనా వస్తువును తీసుకొని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే, కొన్ని భయపడి పోయి పక్కకు వెళుతుండగా మరికొన్ని అరుస్తూ ప్రజల పై దాడులకు దిగుతున్నాయి. వీటి బాధ భరించలేక చాలామంది ఇండ్ల దర్వాజలకు వెనకా ముందు జాలి డోర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. డోర్లు తెరిచి ఉంటే చాలు గుంపుగా వచ్చిన వానరాలు ఇంట్లోని వస్తువులను చిందరవందరగా, పడేయడమే కాకుండా వండుకున్న వంట గిన్నెలను బయటకు ఎత్తుకెళ్లి హంగామా చేస్తున్నాయి.
అడ్డుకునే ప్రయత్నం చేస్తే కరుస్తున్నాయి. దీంతో నాలుగు దఫాలు ఆంటీ రాబిస్ ఇంజక్షన్లు ( Rabies injections ) దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చేయించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఇంజక్షన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల పై గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో భయపడి పోయి ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు ప్రజలు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఇండ్ల పై మార్చ్ ఫాస్ట్ మాదిరిగా తిరుగుతూ పాదచారులు రోడ్ల పై తిరగకుండా అరగంట పాటు భయపెట్టించాయి. ఇకనైనా వానరాల నుంచి విముక్తి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.