MLA Thota Lakshmi Kantarao : రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ

బిచ్కుంద మండల కేంద్రంలోని శుక్రవారం రైతు రుణమాఫీ సంబురాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులతో కలిసి పాల్గొన్నారు.

Update: 2024-07-19 14:02 GMT

దిశ, నిజాంసాగర్ : బిచ్కుంద మండల కేంద్రంలోని శుక్రవారం రైతు రుణమాఫీ సంబురాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులతో కలిసి పాల్గొన్నారు. మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి,ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. రైతు వేదిక దగ్గరకు చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్నం పెట్టే అన్నదాతలను రుణ విముక్తులను చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రిమండలికి జుక్కల్ నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ దేశంలో రైతుల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఇక ముందు ఉండబోదని, ఈ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులకు నిన్న 6 వేల కోట్ల నిధులతో రైతుల రుణ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసి మాఫీ చేయడం జరిగిందని,ఈ నెల ఆఖరులోగా రూ.1.50 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తామని, ఆగష్టు 15 లోగా 2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ మాఫీ జరుగుతుందని వివరించారు.

మొదటి విడుత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం 15,500 రైతు కుటుంబాలకు 80 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మొత్తంలో అత్యధికంగా పిట్లం మండలంలో 3750 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలోని రైతులందరూ రుణమాఫీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.


Similar News