నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభం.. ఎమ్మెల్యే పోచారం

నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని 1977లో అప్పటి ఇందిరా కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా వెంగళరావు ఉండగా సొసైటీ చైర్మన్ గా తాను కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-06-23 10:17 GMT

దిశ, నిజాంసాగర్ : నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని 1977లో అప్పటి ఇందిరా కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా వెంగళరావు ఉండగా సొసైటీ చైర్మన్ గా తాను కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తన రాజకీయ జీవితానికి కాంగ్రెస్ పార్టీతోనే ముగింపు వస్తుందని అనుకుంటున్నానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలో నీటి విడుదల అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను పదవి కోసం, స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోలేదని నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు కార్యకర్తల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని అన్నారు.

తాను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నారని అప్పటి నుంచే వారిఇద్దరి మధ్యలో స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి తనతో మాట్లాడి మీరు పార్టీలోకి వస్తే బాగుంటుందని ఇంటికి వచ్చి ఆహ్వానించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిన పనులు పూర్తి కావాల్సిందని పనులన్నింటినీ పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ముందుగా ప్రాధాన్యత ఇద్దామని అన్నారు. అందరితో కలిసి పని చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముందు ఉంచుతూ, వారి సలహాలతోనే ముందుకు వెళ్దామని అన్నారు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని భేషజాలకు పోకుండా నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుదాం అన్నారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు కార్యకర్తలు ఉన్నారు.


Similar News