ధరణి సమస్యల పై రైతులతో ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖాముఖి..

భూ సంబంధిత అంశాల పై ధరణి కింద దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలను పరిష్కరించాలనే కృత నిశ్చయంతో బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

Update: 2024-06-22 15:02 GMT

దిశ, నవీపేట్ : భూ సంబంధిత అంశాల పై ధరణి కింద దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలను పరిష్కరించాలనే కృత నిశ్చయంతో బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, కలెక్టర్, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం నవీపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులతో ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఒక్కో రైతు వారీగా సమస్యలను అడిగి తెలుసుకుని, అందుకు గల కారణాల గురించి అధికారులను ఆరా తీశారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల పై అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరపాలని ఆదేశించారు.

అర్హత కలిగిన వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ, వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను ఆర్డీఓ లాగిన్ కు ఫార్వార్డ్ చేయాలని సూచించారు. వారం వ్యవధిలో అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు కలిగి ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు భరోసా కల్పించారు. ఈ దిశగా అధికారులను సన్నద్ధం చేసి, యుద్ధప్రాతిపదికన ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. వివిధ కారణాలతో పెండింగ్ లో ఉంచిన ధరణి దరఖాస్తులను వెంటనే నిశిత పరిశీలన జరిపి అర్హులైన రైతులకు పట్టా పాస్ బుక్కులు, సక్సేషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్ వంటి సమస్యలను పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. రైతులతో భేటీలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీ సంగెం శ్రీనివాస్, నవీపేట తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


Similar News