ఐటీఐ కాలేజీలో విద్యార్థుల అడ్మిషన్ మిస్సింగ్..

నిజామాబాద్ లోని ఐటీఐ కాలేజీలో ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్(ఐటీఓటీ) కోర్సులో శిక్షణ పొందిన 2023 - 24 బ్యాచ్ స్టూడెంట్స్ కు పెద్ద చిక్కొచ్చి పడింది.

Update: 2024-07-15 16:33 GMT

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ లోని ఐటీఐ కాలేజీలో ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్(ఐటీఓటీ) కోర్సులో శిక్షణ పొందిన 2023 - 24 బ్యాచ్ స్టూడెంట్స్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. గవర్నమెంట్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి నిజామాబాద్ లోని ఐటిఐ న్యూ (కాలేజ్ కోడ్ - GU36000070) కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న 20 కి పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేక ఆవేదన చెందుతున్నారు. తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన స్టూడెంట్స్ నిజామాబాద్ లోని కాలేజీలో అడ్మిషన్ పొంది రెగ్యులర్ గా క్లాసులకు కూడా హాజరయ్యారు. ప్రతిరోజు బయోమెట్రిక్ సిస్టం ద్వారా అటెండెన్స్ కూడా నమోదు చేసుకున్నారు. ఏడాది పాటు ఒక్కో స్టూడెంట్ 60 నుంచి 80 శాతం కాలేజీకి వెళ్లి బయో మెట్రిక్ విధానంలో అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. విద్యా సంవత్సరం ముగిసింది, ఎగ్జామ్స్ డేట్ షెడ్యూల్ రావడంతో ఫీజ్ చెల్లించడానికి వెళితే కాలేజీలో స్టూడెంట్స్ అందరి అడ్మిషన్ మిస్సయ్యిందని తెలిసి షాక్ తిన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేది జూలై 16న ముగుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.

స్టూడెంట్స్ వివరాలు ఇప్పటివరకు కాలేజ్ డాటాలో లేకపోవడంతో ఫీజును చెల్లించలేక పోతున్నామని స్టూడెంట్స్ వాపోతున్నారు. ఈ సమస్య పై బాధిత స్టూడెంట్స్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో పాటు ఎంపీ అర్వింద్ ధర్మపురిని కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు. గడువు దగ్గర పడే వరకు సిస్టం ప్రాబ్లం, సర్వర్ ప్రాబ్లం అంటూ దాటవేసిన కాలేజీ యాజమాన్యం గడువుకు ఒకరోజు ముందు చేతులెత్తేయడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఏడాది పాటు శిక్షణ పొందిన తమకు పరీక్ష రాసే అవకాశం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని కలెక్టర్, ఎంపీ ఎదుట వాపోయారు.


Similar News