రైతును రాజు చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయం.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.

Update: 2023-06-03 13:53 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. ఎవరికివారు, ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివచ్చి, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల పై రైతువేదికల వరకు ర్యాలీగా చేరుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వన్నెల్ (బి) గ్రామంలో జరిగిన రైతు దినోత్సవ వేడుకలో రాష్ట్ర రోడ్లు - భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి ఎడ్లబండి పై రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, సాగు రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేశారు. సమైక్య రాష్ట్రంలో ఎదురైన వివక్ష, అడుగడుగునా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.

ఉద్యమ నేతగా 2001లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ పోరాటంతో సాధించుకున్నప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లలో వ్యవసాయం, తదితర రంగాల్లో సాధించిన ప్రగతి గురించి రైతులకు తెలియజేశారు. రైతు బంధు, రైతు బీమా ద్వారా లబ్ది పొందిన రైతులచే వారి అనుభవాలను వివరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేములప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతాంగ ప్రయోజనాల కోసం తెలంగాణలో తమ ప్రభుత్వం నిర్మించినన్ని సాగునీటి పథకాలు, చెక్ డ్యాములు, వరద కాలువలు మరే ఇతర రాష్ట్రాల్లో లేవని స్పష్టం చేశారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తూ, రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తూ, అన్నదాతలు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు.

2014లో తెలంగాణలో ఒక కోటి 21 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యేవని, ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయానికి ఇతోధికంగా మేలు చేకూరుస్తుండడంతో రెండు కోట్ల 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. తెలంగాణేతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కింద ఎకరాకు పదివేల రూపాయలు, రైతు బీమా కింద బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించడం, కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పంటను మద్దతు ధరకు సేకరించడం వంటివి అమలు కావడం లేదన్నారు. అందుకే బీహార్ తదితర రాష్ట్రాల రైతులు వారు పండించిన ధాన్యాన్ని సొంత ఖర్చులతో లారీలలో ఇక్కడికి తీసుకువచ్చి కారుచౌక ధరకే విక్రయిస్తున్నారని అన్నారు. అనంతరం మంత్రి రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, నియోజకవర్గ నోడల్ అధికారి సింహాచలం, రైతు ప్రతినిధులు కోటపాటి నర్సింహం నాయుడు, డాక్టర్ మధుశేఖర్, రైతు బంధు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వన్నెల్(బి) క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News