Huge fraud : రైతు రుణాల పేరిట మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ భారీ మోసం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులను నమ్మించి రుణం పేరిట రూ. 9 కోట్లు రూపాయలు కార్పొరేట్ రుణం

Update: 2024-07-29 15:35 GMT

దిశ,నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులను నమ్మించి రుణం పేరిట రూ. 9 కోట్లు రూపాయలు కార్పొరేట్ రుణం పొందడంతో ఫాక్టరీపై చర్యలు తీసుకోవాలని సోమవారం రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారు. అమాయక రైతుల పేర్లపై మోసపూరితంగా తీసుకున్న రుణాలు గాయత్రి షుగర్స్ సంస్థ కొనసాగిస్తున్న ఈ దురాగతాన్ని లేఖ ద్వారా ఆయనకు వివరించారు. దీనిపై తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

జుక్కల్ నియోజకవర్గంలోని 1030 మందికి పైగా అమాయక రైతులను మోసం చేయడం ద్వారా రూ.9,00,00,000ల (అక్షరాలా రూ.9కోట్లు) పంట రుణాలతో సహా వివిధ రకాల రుణాలను మోసపూరితంగా పొంది సంస్థ సొంత వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఈ రుణాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నామీదేవ్ వాడ బ్రాంచ్, నిజామాబాద్ నుంచి సంస్థ నుండి సేకరించినట్లు పేర్కొన్నారు. తాము ఎన్నడూ తీసుకోని రుణాలను మాఫీ చేశామంటూ బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి ఎస్ఎంఎస్ లు రావడంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన రైతులు గాయత్రీ షుగర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

యాజమాన్యం ఇప్పుడు చేతులు దులుపుకుని బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తోందిని తెలిపారు. మీడియా దృష్టిని మరల్చడానికి యాజమాన్యం కుంటి సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. బాధిత రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా, రైతుల హక్కులను పరిరక్షించేలా, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే తదనుగుణంగా పరిష్కరించబడేలా ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేయాలని వ్యవసాయ మంత్రి, తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని తోట లక్ష్మీ కాంతరావు రాష్ట్ర మంత్రికి విన్నవించారు.


Similar News