మాక్లూర్, మాదాపూర్ గుట్టలు మాయం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లుర్ మండల కేంద్రంతో పాటు మాదాపూర్ లోని గుట్టలు యథేచ్ఛగా అక్రమ మొరం తరలింపుతో మాయమవుతున్నాయి.

Update: 2023-12-09 09:48 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లుర్ మండల కేంద్రంతో పాటు మాదాపూర్ లోని గుట్టలు యథేచ్ఛగా అక్రమ మొరం తరలింపుతో మాయమవుతున్నాయి. మాక్లూర్, మాదాపూర్ లలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందాల గుట్టలను మాయం చేస్తూ 2, 3 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే అనుచరులు, ఆర్మూర్ కు చెందిన ఎమ్మెల్యే సమీప బంధువు మొరం వ్యాపారుల అవతారం ఎత్తి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అండదండలతో దర్జాగా 2,3 ఏళ్లుగా రాత్రి పగలు అని తేడా లేకుండా మాక్లూర్, మాదాపూర్, సింగంపల్లి లలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన గుట్టలను మాయం చేస్తూ దర్జాగా మొరం దందా చేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. అసలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దర్జాగా మొరం దందా చేస్తున్న మైనింగ్ అధికారులు తమకేం పట్టనట్లు ఆమ్యామ్యాలకు అలవాటు పడి అక్రమ మొరం దందా వ్యాపారులకు వత్తాసుగా ఉన్నారు.

జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో...అంతా బహిరంగంగానే...

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అతి తక్కువ సమీపంలో, కూతవేటు దూరంలో ఉండే మాక్లుర్ మండల కేంద్రంతో పాటు మాదాపూర్, సింగంపల్లి లలో ప్రకృతి సిద్ధంగా గుట్టలను అక్రమ మొరం దందా వ్యాపారులు దర్జాగా మాయం చేస్తున్నారు. ఇదంతా మాకూరు మండలంలోని మాదాపూర్ సర్పంచ్ పుప్పాల లక్ష్మి భర్త గంగారెడ్డి, ఆర్మూర్ పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు నరేందర్, మాక్లూర్ మండలానికి చెందిన ఒక కల్లు వ్యాపారస్తు డైన రాజేశ్వర్ గౌడ్ తదితరుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గత అధికార పార్టీ ప్రధాన అనుచరుల కనుసన్నల్లోనే 2,3 ఏళ్లుగా జరుగుతున్నాయనే ఆరోపణలు మాక్లురులో జోరుగా వినిపిస్తున్నాయి. మొరం తరలించేందుకు మైనింగ్ శాఖ అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. కానీ గత అధికార పార్టీ నేతలు,

    మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రెండు మూడేళ్లుగా మాక్లురులోని గుట్టలను మాయం చేస్తూ యథేచ్ఛగా అక్రమంగా మొరంను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని టాస్క్ ఫోర్స్ అధికారులు రెండు మూడేళ్లుగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మాక్లూర్ లో జరుగుతున్న అక్రమ మొరం దందాపై శుక్రవారం దాడులు నిర్వహించారు.

    కానీ రెండు మూడేళ్లుగా మాక్లురులో అంతా తామై మొరం దందా నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, సమీప బంధువు పోలీస్, రెవెన్యూ అధికారుల ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లోంచి చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. జిల్లాలోని టాస్క్ ఫోర్స్ అధికారులు, యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ రెవెన్యూ అధికారుల సమాచారంతో తప్పించుకుంటున్న అక్రమ మొరం దందా వ్యాపారులపై దృష్టి పెట్టి కొరడా ఝులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Similar News