లోక్ సభ ఎన్నికలు యజ్ఞంలా భావించాలి

లోక్​సభ ఎన్నికలు యజ్ఞంలా భావించి పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ లు కోరారు.

Update: 2024-03-21 13:52 GMT

దిశ, కామారెడ్డి : లోక్​సభ ఎన్నికలు యజ్ఞంలా భావించి పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ లు కోరారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటలిజెన్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ...ఎన్నికల్లో వ్యయ నియంత్రణ ప్రధాన అంశమని, ప్రతి ఖర్చును లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు తదితర వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి గుర్తించిన వారిపై కేసులు నమోదు చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇందుకు నియమించిన ఫ్లైయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్, వీడియో వీనింగ్ బృందాలు, సెక్టోరల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.

    ఆబ్కారీ, రవాణా, వాణిజ్య పన్నులు తదితర శాఖల సిబ్బందితో సమీకృత చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, 10 లక్షలు పైగా డబ్బు పట్టుపబడిన సందర్భంలో ఆదాయ శాఖ అధికారులకు సమాచారమందించాలన్నారు. గిఫ్ట్ వస్తువుల రవాణాపై వాణిజ్య పన్నుల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అనుమానాస్పద, ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలపై ప్రతి రోజూ నివేదిక అందించాలని, అక్రమ మద్యం నిల్వలు, మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని ఆబ్కారీ అధికారులకు సూచించారు. అదేవిధంగా బస్సు ప్రయాణంలో

     అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచార మందించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు సూచించారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుండి విస్తృత తనిఖీలు చేస్తూ గత మూడు రోజుల్లో 7.6 లక్షలు, నేడు 4.50 లక్షల నగదు తో పాటు 986 లీటర్ల ఐఏం ఎఫ్ఎల్ మద్యాన్ని పట్టుకున్నామన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో మాదిరే ఈ ఎన్నికలల్లో అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం, కానుకలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ నిఖిత, ఆర్టీఓ. శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు, రమేష్ రాథోడ్, రంగనాథ్, మన్నే ప్రభాకర్, బావయ్య, భార్గవ్ సుధీర్, ఇందిర తదితర అధికారులు, తహాసీల్ధార్లు పాల్గొన్నారు.

ఓటింగ్ శాతం పెంచేందుకు యువతను ప్రోత్సహించాలి

ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను నూతన ఓటరుగా నమోదుతో పాటు ఓటింగ్ శాతం మరింత పెంచేలా స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలోని ఏర్పాటు చేసిన స్వీప్ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో మరో మూడు శాతం మేర 18-19 సంవత్సరాలలోపు యువతను ఓటరుగా నమోదు చేయడానికి అవకాశంముందని, ఆ దిశగా యువతను ప్రోత్సహించి ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. మే 13న జరిగే లోక్ సభ పోలింగ్ కు తాను ఖచ్చితంగా ఓటేస్తాను అనే భావన కలిగించి ఓటింగ్ శాతం పెంచేలా చూడాలన్నారు.

     12 రకాల ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పని సరిగా పోలింగ్ బూతుకు తీసుకువచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. వేసవి దృష్ట్యా పోలింగ్ మొదలైన మొదటి గంటలోనే భారీగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల సహకారంతో పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఈ మాసంలో క్యాంపస్ అంబాసిడర్ల ద్వారా కళాశాలలో ఫ్యూచర్ ఓటరు దారులను ఓటర్లగా నమోదు చేయించామని, మాక్ పోలింగ్, మానవ హారం నిర్వహించామని, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించామన్నారు. మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా అవగాహన కార్యక్రమాలు

    నిర్వహిస్తూ రంగోళి పోటీలు నిర్వహించామన్నారు. ప్రతి ఓటరుకు తమ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉన్నదో (ఓటర్ హెల్ప్ లైన్, ఓటర్ ఇన్ఫర్మషన్ స్లిప్) అవవగాహన కలిగించేందుకు ఈ నెల 22 న వాక్ టు పోలింగ్ బూత్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అదేవిధంగా 26న శాసనసభ సెగ్మెంట్ లో 5 కె రన్, 28 న గోడలపై ఓటు ప్రాముఖ్యత పై ఫొటోలు, స్లోగన్ పెయింటింగ్ లు వేయించనున్నామని కలెక్టర్ తెలిపారు. నవ యువత, థర్డ్ జెండర్ లను ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎన్ఎస్ఎస్. ఎన్సీసీ, నెహ్రు యువక కేంద్రం, కళాశాల లిటరసీ క్లబ్ లను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, సభ్యులు ధర్మా నాయక్, శైలి, రామగిరి శర్మ, ఆర్డీఓలు రంగనాథ్, రమేష్ రాథోడ్, మన్నే ప్రభాకర్, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు. 


Similar News