నిజాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది.
దిశ,నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందని నీటి పారుదల శాఖ ఏఈఈ శివ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1404.50 అడుగులు, 17.079 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు చెప్పారు. ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రాజెక్టు మూడు వరద గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదిలిపెడుతున్నట్లు ఏఈ తెలిపారు. అదేవిధంగా వాగులు,వంకలు,కూడా వర్షపు నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు,రైతులు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.