కల్యాణ లక్ష్మి లక్ష సరే తులం బంగారం ఏది.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు రూ. 1 లక్ష నగదుతో పాటు ఇస్తానన్న తులం బంగారం ఎక్కడా అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-07-15 12:52 GMT

దిశ, భీంగల్ : మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు రూ. 1 లక్ష నగదుతో పాటు ఇస్తానన్న తులం బంగారం ఎక్కడా అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం భీంగల్ మండల కేంద్రంలోని బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన భీంగల్ మండలానికి చెందిన 136 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల ప్రచారంలో పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి అలవి కానీ హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. కేసీఆర్ ఉంటే ఈ నెల లక్ష.. వచ్చే నెల మేమొస్తే లక్షతో పాటు తులం బంగారం ఇస్తాం అని అన్నారని.

ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తోందని ..లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కష్టం కాకూడదని కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాన్ని ప్రారంభించారని, ఆ కార్యక్రమాన్ని గత పది ఏండ్లుగా పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం చేశారన్నారు. ఆడపిల్లల పెండ్లి కోసం అదనంగా బంగారం ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే లబ్దిదారులందరికీ తులం బంగారం ఇచ్చి తీరాలని ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలం అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News