సహకార సంఘాల్లో అవిశ్వాస లొల్లి

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించిన రెండు ప్రధాన జిల్లా

Update: 2024-03-03 14:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించిన రెండు ప్రధాన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, ఐడీసీఎంఎస్ చైర్మన్లపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో రెండు ప్రధాన పదవుల్లో ఉన్న చైర్మన్లను గద్దె దింపేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు సహకార సంఘాల్లో చైర్మన్లు రాజీనామా చేయడమో లేదా పార్టీ మారడమో జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని 142 సహకార సంఘాలకు కేంద్ర బిందువు అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిపై కాంగ్రెస్ నాయకులు అవిశ్వాసానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో పాటు సహకార సంఘాల్లో జరిగిన అవినీతి, అక్రమాల నేపథ్యంలో చాలా మంది సొసైటీల చైర్మన్లు రాజీనామాలు సమర్పిస్తున్నారు. అంతేగాకుండా మరికొంత మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో గద్దె దింపేందుకు ప్రయత్నాలు జరుగడం విశేషం. అదే కోవాలో ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిపై అవిశ్వాసానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇది తెలిసిన చైర్మన్ సాంబారి మోహన్ పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలిసింది.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐడీసీఎంఎస్ చైర్మన్ ను గద్దె దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతుంది. అదే సమయంలో మోహన్ చైర్మన్ పదవి కోసం పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలను శరణు కోరుతున్నట్లు తెలిసింది. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా అధికార పార్టీ అవిశ్వాసాలకు సిద్దం కావడంతో డీసీసీబీ, ఐడీసీఎంఎస్ చైర్మన్లు పార్టీలు మారి పదవులు కాపాడుకున్నారు.


Similar News