తప్పుల తడకగా కరెంటు బిల్లులు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లె పంచాయతీ కరెంట్ బిల్లులో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
దిశ, మాచారెడ్డి: వేలల్లో రావలసిన కరెంట్ బిల్లు లక్షల్లో కాదు.. కోట్లల్లో వచ్చిందంటూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లె పంచాయతీ సిబ్బంది ఉలిక్కిపడింది. ఆ గ్రామానికి సంబంధించిన తాగునీటిని అందించే బోరుబావి కరెంటు బిల్లు ప్రతి నెల వేల రూపాయలు వచ్చేది. జనవరి నెలకు గాను మీటర్ రీడింగ్ ద్వారా ఇచ్చిన కరెంట్ బిల్లు చూసి పంచాయతీ కార్యదర్శి అవాక్కయ్యాడు. విషయాన్ని సర్పంచ్ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లగా వారు విద్యుత్ అధికారులతో మాట్లాడారు. కొత్తపల్లి బోరు మోటర్ కరెంట్ బిల్లు విషయంలో తడబడిన విద్యుత్ అధికారులు అది సాంకేతిక సమస్య అంటూ దాటవేసి వెంటనే సరి చేసిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి నెలకు గాను ₹114022208 బిల్లు వేశారు. పైసలు తెలిపే డిజిట్ లేని కారణంగా ఇది కోట్ల రూపాయలుగా పరిగణించాల్సి వచ్చింది.
పాత బకాయి ₹141460.61 గా వేశారు. ఇవి రెండు జమ చేస్తే ₹128168269 అవుతుంది. కానీ 114163672 నెట్ అమౌంట్ గా వేశారు. ఈ విధంగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా బిల్లులు తప్పుల తడకగా మారి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక సవరించిన బిల్లును పరిశీలిస్తే జనవరి నెలకు గాను 6682 రూపాయల బిల్లు వేశారు. పాత బకాయి ₹141468.68 తో కలిపి నెట్ అమౌంట్ ₹148142.61 గా వేసి సరిదిద్దారు. మొన్నటి వరకు ఏసీడి చార్జీలు వేయడంతో ఆందోళన చెందిన వినియోగదారులకు తప్పుల తడకగా మారిన విద్యుత్ బిల్లులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేసి వినియోగదారులను ఆందోళన గురికాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
జీపీ కార్యాలయానికి రూ.11.41 కోట్ల కరెంట్ బిల్లు
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఒక నెలకు ఏకంగా రూ.11.41 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి రూ.11,41,63,672 విద్యుత్ బిల్లు వేశారు. దీంతో విద్యుత్ బిల్లును చూసిన సర్పంచ్, కార్యదర్శి కంగుతిన్నారు.
రూ.కోట్లలో కరెంట్ బిల్లు రావడంతో గ్రామస్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. దీనిపై పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి, సర్పంచి విద్యుత్ అధికారులను నిలదీశారు. ఓవైపు గ్రామ పంచాయతీలకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు విద్యుత్ అధికారులు ఏసీడీ ఛార్జీల పేరుతో భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీ కార్యాలయానికి రూ.కోట్లలో విద్యుత్ బిల్లు వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాచారెడ్డి ఏఈ వెంకటరమణను వివరణ కోరగా.. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ బిల్లు రూ.కోట్లలో వచ్చిందని, ఉన్నతాధికారుల సహకారంతో బిల్లును పునరుద్ధరిస్తామని ఏఈ తెలిపారు.