కవిత... తొందర పడకు...పాత బకాయిలు మీ నుంచి కట్టిస్తాం

ఎమ్మెల్సీ కవిత తొందరపడొద్దని, పాత బకాయిలు మీ కుటుంబం జమ చేసిన పైసల నుండి కట్టిస్తామని, పదిమంది బాగుపడే సలహాలు మాత్రమే ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హితవుపలికారు.

Update: 2023-12-28 14:10 GMT

దిశ, బోధన్ : ఎమ్మెల్సీ కవిత తొందరపడొద్దని, పాత బకాయిలు మీ కుటుంబం జమ చేసిన పైసల నుండి కట్టిస్తామని, పదిమంది బాగుపడే సలహాలు మాత్రమే ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హితవుపలికారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామంలో గురువారం ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వారికి రశీదులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడమే ప్రజా పాలన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. వచ్చేనెల 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం

    జరుగుతుందని, అర్హులైన వారందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేకూర్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేయాలని హితవు పలికారు. కవిత తో చెప్పించుకునే పరిస్థితి లేదని, 60 కోట్ల ప్రజల ధనం తో కార్లు కొని విజయవాడలో దాచిన మీ సలహాలు అవసరం లేదని, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కవిత కు కాదని, అవి పేదవారికి తప్పకుండా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, బోధన్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ మోతిసింగ్, కాంగ్రెస్, పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Similar News