సిద్ధ రామేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకొని దక్షిణ కాశీగా భాసిల్లుతున్న భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం సోమవారం రాత్రి కార్తీక దీపాలతో అలరారింది.

Update: 2023-12-11 14:18 GMT

దిశ, భిక్కనూరు : కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకొని దక్షిణ కాశీగా భాసిల్లుతున్న భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం సోమవారం రాత్రి కార్తీక దీపాలతో అలరారింది. శ్రావణమాసం తరువాత, కార్తీక మాసానికి ఈ ప్రాంత ప్రజలు ప్రాముఖ్యతనిస్తుండడంతో సిద్ధ రామేశ్వరాలయం భక్తుల రద్దీతో నిత్యం కిటకిటలాడుతోంది. కార్తీక మాసానికి ఆఖరి రోజు కావడం, శివునికి ప్రీతిపాత్రమైన రోజు సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా దర్శించుకున్నారు. పలువురు దంపతులు ప్రధాన మండపంలో జరిగిన ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

    మాతా భువనేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సైతం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడంతోపాటు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించేందుకు సైతం పెద్ద ఎత్తున దంపతులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి వరకు ఆలయంలో ఉండి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించేందుకు పోటీ పడడంతో ఆలయ ప్రాంగణం కార్తీక దీపాల వెలుగులతో సందడిగా మారింది. పోటాపోటీగా పలువురు దంపతులు దీపాలు ముట్టించారు. ఆలయ ఈఓ పద్మ శ్రీధర్, అర్చకులు కొడకండ్ల సిద్ధ రామ శర్మ, కొడకండ్ల రామగిరి శర్మ, న్యాల కంటి రాజేశ్వర శర్మ, ప్రభు సిద్దేష్ లు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.


Similar News