రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్సే

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతన్నల కోసం ఎన్నో ప్రాజెక్టులను కట్టిన, లిఫ్ట్ ఇరిగేషన్లను నెలకొల్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని, శ్రీరామ్ సాగర్ ని నిర్మించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-05 15:26 GMT

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతన్నల కోసం ఎన్నో ప్రాజెక్టులను కట్టిన, లిఫ్ట్ ఇరిగేషన్లను నెలకొల్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని, శ్రీరామ్ సాగర్ ని నిర్మించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నందిపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో పార్టీ మండల అధ్యక్షుడు మందమైపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశానికి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడు సంవత్సరాలు గడవకముందే మేడిగడ్డ ప్రాజెక్టు కృంగిపోవడం గత రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పరాకాష్టని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా లక్షల ఎకరాల్లో రైతులకు సాగు, తాగు నీటిని అందిస్తున్నాయని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు బీజేపీ ఎంపీ అరవింద్ రైతులకు ఏమి చేశారో స్పష్టం చేయాలన్నారు.

    ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చిన ఆయన ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలన్నారు. దీనికి తోడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా పసుపు బోర్డు నెలకొల్పుతున్నట్లు చెప్పించి ఇప్పటికీ అతీగతి లేకపోవడం రైతులను మోసం చేసి పబ్బం గడుపుకోవడం కాదా అన్నారు. అటు కేంద్రంలో ఇటు గత ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అరవింద్ గల్ఫ్ బాధితుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన పదవీకాలంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో స్పష్టం చేయాలన్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పై ఉన్న వ్యతిరేకతతో రైతులు అరవింద్ ను గెలిపించారే తప్ప మరొకటి లేదని అన్నారు. తాను ఎంపీగా గెలిస్తే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుతోపాటు గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గల్ఫ్ బాధిత కుటుంబాలలోని పిల్లలకు ఉచిత విద్యతోపాటు

    ఆరోగ్య బీమా కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ను ప్రజలు ఆదరించి రెండు పర్యాయాలు అధికారం కట్టబెడితే రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని, కుటుంబ సభ్యులను చక్కదిద్దడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ మాయ మాటలు నమ్మిన ప్రజలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచారని, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం సంతోషకరమైన విషయం అని చెప్పారు.

    అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని, ఇటు రాష్ట్రం అటు దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీని, పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతును రాజు చేసి రైతంగానికి పెద్ద పీట వేసిన కాంగ్రెస్ పార్టీకి అండగా మరోసారి నిలబడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీగా తనను గెలిపిస్తే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ తో పాటు, గల్ఫ్ బాధితులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, బీడీ కార్మికులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

400 ఎకరాల్లో లక్కంపల్లి సెజ్ కు భూమి కేటాయించాం

పక్కనే ఉన్న లక్కంపల్లి సేజ్ కోసం 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే గత ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. తనను ఎంపీగా గెలిపించిన మరుక్షణం కేంద్రంతో కొట్లాడి నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పాటుపడతానన్నారు. సెజ్ లో ప్రాజెక్టులను నెలకొల్పి

    వివిధ కంపెనీల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా పాటుపడతానని హామీ ఇచ్చారు. అప్పటి మాజీ ఎంపీ కవిత హంగు ఆర్భాటాలకే తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎంపీ అరవింద్ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పాపాన పోలేదని మండిపడ్డారు. బాండ్ పేపర్లు రాసిచ్చి రైతులను మోసం చేసి ఓట్లు దండుకున్నారని, మళ్ళీ ఇప్పుడు రైతులను మోసం చేయడానికి కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని, అలాంటి కల్లబొల్లి మాటలను రైతులు నమ్మవద్దని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఒక రైతు : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

రైతాంగానికి అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని, అందుకనే హై కమాండ్ అన్ని విధాలుగా ఆలోచించి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపిక చేసిందని, ఆయన కూడా ఒక రైతే అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతుల బాధలు ఆయనకు తెలుసని, మన తరఫున మాట్లాడడానికి, పోరాటం చేయడానికి ఒక సరైన మనిషి కావాలని, ఆయనే జీవన్ రెడ్డి అని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గడిచిన 10 సంవత్సరాలలో ఇద్దరు ఎంపీలు మన ప్రాంతానికి చేసిందేమీ లేదని అన్నారు.

కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ రెడ్డి

రాష్ట్రంలో అమలవుతున్న 6 గ్యారెంటీ పథకాలపై ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం కష్టపడాలని కోరారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, పథకాల అమలు తీరును ప్రజలకు వివరించాలన్నారు. అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి పశువు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులను మోసం చేసిన తీరును కూడా ప్రజలకు తెలిసేలా చెప్పాలన్నారు.

    ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతిరెడ్డి, మాజీమంత్రి మాండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు ఆకుల రాము, ఎస్ఆర్ సుజాత రమేష్, బండారి ప్రసాద్, లిక్కి శంకర్, రింగుల భారతి భూషణ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News