వీజీ గౌడ్ ఎమ్మెల్సీ ఆశలు గల్లంతు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గత నెలలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పదవీకాలం ముగిసింది.
నిజామాబాద్ తాజా మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ కు మూడోసారి ఎమ్మెల్సీ అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. అదే మాదిరిగా జిల్లా నుంచి ఎమ్మెల్సీ అవుదామని పెట్టుకున్న నేతల ఆశలు గల్లంతయ్యాయి. ఆదివారం సీఎం కేసీఆర్ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఎవ్వరి పేరు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే పూర్వపు నల్లగొండ నుంచి ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఖరారు ఖాయమని చెబుతుండగా మిగిలిన ఏకైక ఎమ్మెల్సీ వ్యాపారవేత్తలకు ఇస్తారని చర్చ జరుగుతుంది. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రాగా అందులో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఇది వరకే ఖరారైన విషయం తెల్సిందే. మిగిలిన ఐదులో నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుత తాజామాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఆశించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గత నెలలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పదవీకాలం ముగిసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం సమీకరణల నేపథ్యంలో ఎమ్మెల్సీగా వీజీ గౌడ్ కు మూడవ దఫా అవకాశం వస్తుందని ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ గౌడ సామాజిక వర్గం నుంచే ఎమ్మెల్సీ పదవికి తీవ్ర పోటీ ఉండడంతో ఈసారి నిజామాబాద్ స్థానం పూర్వపు నల్గొండ జిల్లాకు వెళ్లడం ఖాయంగా మారింది.
గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పలువురు నేతలకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఆఫర్ వీజీగౌడ్ కుర్చీకి ఎసరు తెచ్చింది. నిజామాబాద్ జిల్లాలో సౌమ్యుడిగా, వివాదారహితుడిగా పేరున్నప్పటికీ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీగా చేసి ఉండడంతో మూడవసారి అవకాశాలు లేవని చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ పదవులకు చాలా మంది గట్టి ప్రయత్నాలు చేయడంతో బీసీ నాయకుడిగా వీజీగౌడ్ కు మాత్రం అవకాశం లేదని జిల్లాలో చర్చ జరుగుతుంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మైనార్టీ లీడర్లు ఆ పదవి కోసం ఎదురు చూశారు. ఈ యేడాదిలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ కు అవకాశం కల్పించారు. గత వారం నిజామాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తారీఖ్ అన్సారీకి తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో మైనార్టీ నాయకులకు ఎమ్మెల్సీ అవకాశాలు లేకుండా పోయాయి.
మిగిలిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నాయకుడు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించి 9న నామినేషన్ వేయాలని ప్రకటించిన సీఎం కేసీఆర్ రెండు ఎమ్మెల్సీ పదవుల కేటాయింపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ పదవి ఉమ్మడి జిల్లాకు కష్టమేనని సంకేతాలు వచ్చాయని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.