Induru : ఇందూరు మురిసింది…ఉత్సాహంగా ఊరపండగ

ఆషాడ మాసంలో ప్రతియేటా జరుపుకునే ఊర పండగను ఆదివారం నిజామాబాద్ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య భక్తి ప్రపత్తులతో ఘనంగా జరుపుకున్నారు.

Update: 2024-07-28 10:40 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆషాడ మాసంలో ప్రతియేటా జరుపుకునే ఊర పండగను ఆదివారం నిజామాబాద్ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య భక్తి ప్రపత్తులతో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునుంచే నగరం సందడిగా మారింది.

తెల్లవారుజాము నుంచే..

ఇందూరు సర్వసమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఊరపండగ ను నగరంలోని ఖిల్లా ప్రాంతం లోని తేలు గద్దె మైసమ్మ వద్ద నుండి ప్రారంభమైనాయి. ముందుగా సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, నగరంలోని అన్నీ కులసంఘాల పెద్దలంతా కలిసి కొండెంగ హన్మాండ్ల వద్ద అమ్మవార్ల ప్రతిమలను తయారుచేసిన వడ్ల దాతీయుల ఇంటికి వెళ్లారు. మామిడి చెట్టు కలపతో ప్రత్యేకంగా తయారుచేసిన దేవతా ప్రతిమలు బద్ది పోచమ్మ, ముత్యాలమ్మ, ఐదు చేతుల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మ, మత్తడి పోచమ్మ, కాంతాలమ్మ, సార్గమ్మలు వంటి అమ్మ వార్ల ప్రతిమలతో పాటు ప్రధానమైన తొట్లెలు ను వడ్రంగుల ఇంటి నుండి డప్పుల చప్పుళ్లు, భక్తుల ఉత్సాహపు కేరింతల మధ్య ఖిల్లా వరకు బోనాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు.

వాటిని అక్కడి తేలు మైసమ్మ గద్దెపైకి చేర్చారు. అమ్మవార్లకు పసుపు కుంకుమ గులాలు జల్లి పట్టు వస్త్రాలతో చెవి పోగులు, గాజులతో అమ్మవారి ప్రతిమలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులకు యాటను కోసి బలి ఇచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ లతో పాటు ఉత్సవ నిర్వాహకులు సర్వ సమాజ్ కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు.

ఊరేగింపుగా నగరంలోకి దేవతామూర్తులు ..

ఖిల్లా తేలు మైసమ్మ గద్దె నుండి బయలుదేరిన అమ్మ వార్ల ప్రతిమల ఊరేగింపును నగరం నలుదిక్కులా తీసుకెళ్లారు.

అమ్మవార్ల ఊరేగింపు శోభయాత్రలో

పోతారాజుల విన్యాసాలు నగరవాసులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపులో దారి పొడవునా నగరవాసులు అమ్మవార్లకు కోళ్లు, మేకలు బలి ఇచ్చారు. పాత చాటలు, చీపుర్లు పైకి ఎగరేస్తూ గ్రామదేవతలకు కల్లు సాకలు పోసి, జీవాలను బలిస్తూ భక్తిని చాటుకున్నారు.

ఊర పండగకు జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఊరేగింపు ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ప్రశాంతంగా జరిగింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందుగానే సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ నిర్దేశించిన పలు రూట్లలో ట్రాఫిక్ ను మళ్లించి ఆంక్షలు విధించారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని ఎస్ ఐ లు సీఐ లు సిబ్బంది, మహిళా పోలీసులు, హోమ్ గార్డులు బందోబస్తులో పాల్గొన్నారు. ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.


Similar News