పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు..

పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటో వెళ్తుంది. రోజురోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

Update: 2025-01-05 15:38 GMT

దిశ, కామారెడ్డి : పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటో వెళ్తుంది. రోజురోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్నిసాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది. కట్టుకున్న భార్యలను, కలకాలం కలసి ఉండాల్సిన భర్తలను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా కడుపున పుట్టిన పిల్లలు, తమ పై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి.

పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు..

జిల్లాలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా పచ్చని కుటుంబాలు ఆగం అవుతున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా మారుతున్నారని, సొంత భార్య, భర్తలనే హతమారుస్తున్నారు. దాంతో కుటుంబాల మధ్య వివాదాలు పెట్రేగిపోతున్నాయి. కొన్ని సంబంధాలు గ్రామాల్లో బహిర్గతం అవుతుండటంతో బహిరంగంగా పంచాయతీలు పెట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. దాంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో మొహం చెల్లక ఆత్మహత్యల బాట పడుతున్నారు.

రోడ్డున పడుతున్న కుటుంబాలు..

వివాహేతర సంబంధాలతో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన కాపురంలో ఈ సంబంధాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొందరు పగలు, ప్రతీకారాలకు జీవిస్తున్నారు. ఫలితంగా రక్తం పంచుకుపుట్టిన పిల్లలు అనాధలుగా మారుతున్నారు.

అవగాహన కరువు...

జిల్లాలో విచ్చలవిడిగా పెరుగుతున్న వివాహేతర సంబంధాల సంస్కృతికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో సైబర్ నేరాలు, ఆత్మహత్యల పై అవగాహన కల్పిస్తున్నట్టుగానే వివాహేతర సంబంధాల వల్ల కలిగే నష్టాల పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు, పోలీసులు విఫలమవుతున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.


Similar News