మంత్రి ఇలాకాలో వీడీసీ దౌర్జన్యం..
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మోతే గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ రెచ్చిపోయింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మోతే గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ రెచ్చిపోయింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండలం వేల్పూర్ లో మోతె గ్రామంలో దళితులకు సంబంధించిన ఎకరం నర భూమిని స్వాధీనం చేసుకునేందుకు దౌర్జన్యానికి దిగింది. గ్రామ అవసరాల పేరిట దళితుల భూమిని లాక్కునేందుకు వీడీసీ ఒకవైపు దళిత కుటుంబం మరోవైపుగా దౌర్జన్యకాండ జరిగింది. ఆదివారం సమావేశం నిర్వహించి దళితుల భూమిని కబ్జా చేసేందుకు యత్నించడం కలకలం రేపింది.
ల్యాండ్ చుట్టునాటిన కంచెను తొలగించి అడ్డొచ్చిన దళితుల పై వీడీసీ సభ్యులు దాడి చేశారు. న్యూస్ కవరేజ్ కొసం వెళ్లిన జర్నలిస్ట్ లపై వీడీసీ సభ్యులు దాడి చేసి ఫోన్ లు, కెమెరాలు లాక్కుని ధ్వంసం చేశారు. దాడి జరిగే ప్రమాదం ఉందని బాధితులు ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, ఎన్నిసార్లు డయల్ 100 కాల్ చేసినా పోలీసులు రాలేదని బాధితుల ఆరోపణలు చేశారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో అధికారిక పర్యటనలు నిర్వహిస్తున్న సమయంలోనే వీడిసి దౌర్జన్యం కలకలం రేపుతుంది. 2000 మంది వీడీసీ తాలూకు గ్రామస్తులు కలిసి ఒక దళితుడి భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఇద్దరు కానిస్టేబుల్ రక్షణ పంపించడం పై విమర్శలు వస్తున్నాయి.