అపశ్రుతులు జరగకుండా నిమజ్జన ఏర్పాట్లు చెయ్యాలి

వినాయక నిమజ్జనంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , సీపీ కల్మేశ్వర్​ ఆదేశించారు.

Update: 2024-09-10 12:12 GMT

దిశ, నవీపేట్ : వినాయక నిమజ్జనంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , సీపీ కల్మేశ్వర్​ ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని కోరారు. భారీ వినాయకులను నిమజ్జనం చేసే బాసర గోదావరి బ్రిడ్జి ను కలెక్టర్, సీపీ ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మీడియాతో మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించుకోవాలని హితవు పలికారు.

     ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భారీ విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి తరలించాలని సూచించారు.

    ఈ మేరకు నందిపేట మండలం ఉమ్మెడ వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బాసర బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News