గ్రీన్ లైట్ వెలిగితే కమిషనర్ ఉన్నట్లే

నిజామాబాద్ నగర ప్రజల సమస్యల పరిష్కారానికి తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని మున్సిపల్ కమిషనర్ మంద మకరందు తెలిపారు.

Update: 2024-08-14 12:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర ప్రజల సమస్యల పరిష్కారానికి తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని మున్సిపల్ కమిషనర్ మంద మకరందు తెలిపారు. అన్ని పని దినాల్లో ప్రజలు తనను కలవొచ్చని కమిషనర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కార్యాలయంలో తాను అందుబాటులో ఉండే సమయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అన్ని పనిదినాలలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కమిషనర్ తన కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. తన కార్యాలయంలో బయట గ్రీన్ లైట్ వెలుగుతూ కనిపిస్తే తాను కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్టు అని పేర్కొన్నారు.

    నగరపాలక సంస్థలో వివిధ సేవల కోసం కార్యాలయానికి వచ్చే నగర ప్రజలు వారి దరఖాస్తులను నేరుగా పౌరసేవా కేంద్రంలో సమర్పించవచ్చని సూచించారు. ప్రజల దరఖాస్తులు నిర్ణీత సమయంలోనే పరిష్కరించబడతాయని కమిషనర్ అన్నారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిష్కరించకపోతే దరఖాస్తుదారులు, నగర ప్రజలు అన్ని పనిదినాలలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో కమిషనర్ ను నేరుగా కలిసి, వారి ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. కార్యాలయంలో కమిషనర్ అందుబాటులో ఉన్నప్పుడు, గ్రీన్ లైట్ ద్వారా తెలియజేస్తామన్నారు. క్షేత్ర సందర్శనలు, పర్యవేక్షణ, మీటింగులు, ఇతర కారణాలతో కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో లేని సమయంలో కార్యాలయ మేనేజర్ కు అందజేయొచ్చన్నారు.

    అక్కడ ఏర్పాటు చేసిన టప్పాలో వేసినా వాటిని పరిశీలనకు తీసుకుంటామని పేర్కొన్నారు. జాప్యానికి కారణమైన అధికారులు, సిబ్బందిపైన తగిన విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ పర్మిషన్ సహా ఇతర సేవలు టీబీఎస్ అనే ఆన్ లైన్ విధానంలో అందించనున్నట్టు తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులను నేరుగా ఎవరు కలవాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. నియమావళికి విరుద్ధంగా ఎవరూ నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ,

    ఇతర సిబ్బంది కానీ సంస్థ సేవలకోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, 14420 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కంప్లయింట్ చేయాలని సూచించారు. కంప్లయింట్ ఇవ్వడానికి జనరల్ ఫోన్ నెంబర్ 08462- 221001 కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కమిషనర్ వాట్సాప్ నెంబర్ 7815957047 ద్వారా కూడా కంప్లయింట్ చేయొచ్చని వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పై ఎలాంటి ఆరోపణలు వచ్చినా తగిన విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కమిషనర్ మంద మకరందు తెలిపారు. 

Tags:    

Similar News