మోడీ నిజామాబాద్ నుంచి పోటీచేస్తే గెలుపుకోసం పాదయాత్ర చేస్తా

తెలంగాణలో మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్ నుంచి ప్రధాని మోడీ రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-26 09:34 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్ నుంచి ప్రధాని మోడీ రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. మోడీ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే అంతకన్నా భాగ్యం ఎముంటుందని, అయనను పోటీకి స్వాగతిస్తామని, ఆయన గెలుపుకోసం పాదయాత్ర చేస్తానని అన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన అసెంబ్లి ఎన్నికలలో నిజమాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ 30 శాతం ఓట్లు సాధించటం సంతోషం అన్నారు. పార్టీని డెవలప్ చేసేందుకే కోరుట్లలో పోటీ చేసానని, జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికలు నాంది పలికాయి అని తెలిపారు. అసెంబ్లి ఎన్నికలలో తనకు డబ్బులు పంచమని చాలా మంది చెప్పారని, కానీ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశాం అన్నారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశా అని గుర్తు చేశారు.

    2018 తో పోల్చితే నిజమాబాద్ పార్లమెంటు పరిధిలో తమ పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని, గత 5 ఏళ్లలో తన మీద నయా పైసా అవినీతి ఆరోపణలు లేవు అని అన్నారు. ఎంపీగా పసుపు బోర్డు తెచ్చా.. నిధులు తెచ్చా.. పార్టీని బలోపేతం చేశా..కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడ్డానని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలని, దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని అన్నారు. మళ్లీ మోడీనే పీఎం అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చూడాలి అని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని, అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర సాయం కోరడం మంచి పరిణామం అన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. మోడీ గత ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా పసుపు బోర్డు పనులు ఊపందుకున్నాయి అన్నారు. రానున్న రోజుల్లో పసుపుకు రూ.20 వేలు మద్దతు ధర ఇప్పిస్తాం అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 200 కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు యోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. జిల్లాలో బీజేపీ అధ్యక్షుని మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించడానికి ఎంపీ ఇష్టపడలేదు. అది పార్టీ అంతర్గత వ్యవహారం అని, రాష్ర్ట కమిటీ చూసుకుంటుందని అన్నారు. నిజామాబాద్ మేయర్ పై బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన లేదని అన్నారు. బీజేపీ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు తిరిగి వస్తున్నారని, మళ్లి జరిగే బల్ధియా ఎన్నికలలో పూర్తి మెజార్టీతో మేయర్ స్థానం కైవసం చేసుకుంటామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, రాష్ర్ట కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Similar News