రైల్వే ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం.. హైదరాబాద్ డివిజన్ మేనేజర్

నిజామాబాద్‌లోని క్రూ రన్నింగ్ రూమ్‌లో గైడెడ్ మీడియా టూర్ ని హైదరాబాద్ డివిజన్ మేనేజర్ నిర్వహించారు.

Update: 2024-07-11 15:47 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్‌లోని క్రూ రన్నింగ్ రూమ్‌లో గైడెడ్ మీడియా టూర్ ని హైదరాబాద్ డివిజన్ మేనేజర్ నిర్వహించారు. గురువారం నిజామాబాద్‌లోని క్రూ రన్నింగ్ రూమ్‌లో లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, రైలు మేనేజర్‌ (రన్నింగ్ స్టాఫ్)లకు అందిస్తున్న సౌకర్యాల పై మీడియా గైడెడ్ టూర్‌ని నిర్వహించారు. ఈ టూర్ లో హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనిరుధ్ పమర్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ జీషన్ అహ్మద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ లోకో పైలట్‌లు రైల్వే కుటుంబంలో ముఖ్యమైన సభ్యులని, రైల్వే వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.

నిజామాబాద్ రన్నింగ్ రూమ్‌లో మొత్తం 27 ఎయిర్ కండిషన్డ్ రూమ్లు ఉన్నాయి. ఈ రూమ్‌ల ద్వారా రోజుకు 60 మంది సిబ్బందికి వసతి కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. సిబ్బందికి సబ్సిడీ ధరలతో ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన భోజనం కూడా అందిస్తారన్నారు. ఈ రన్నింగ్ రూమ్‌లో లాంజ్/రీడింగ్ రూమ్, ధ్యానం కోసం యోగా గది, లాండ్రీ, షూ షైనింగ్ మెషిన్, క్లీన్ వాష్‌రూమ్‌లు, సోలార్ వాటర్ హీటర్లు, బెడ్ ఆక్యుపెన్సీ సిస్టమ్‌తో రిసెప్షన్, డైనింగ్ హాల్, మాడ్యులర్ కిచెన్, స్టోర్, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తదనంతరం, మీడియా సిబ్బందికి రన్నింగ్ రూమ్ వద్ద సిబ్బంది పనితీరు పై వివరించారు. హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర అధికారులు, మీడియా సిబ్బందితో కలిసి డైనింగ్ హాల్‌లో రన్నింగ్‌ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ మధ్యాహ్న భోజన సమయంలో లోకో పైలట్‌లతో వివరంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

డివిజనల్ రైల్వే మేనేజర్ లోకో పైలట్‌లతో చర్చించి వారి నుండి సూచనలు, సలహాలు తీసుకున్నారు. లోకో రన్నింగ్ సిబ్బందికి అనుకూలమైన పని పరిస్థితులు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనిరుధ్ పమర్ మీడియా సిబ్బందికి స్వాగతం పలికారు. హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ జీషన్ అహ్మద్, లోకో పైలట్ల పని తీరు, క్రూ బుకింగ్ లాబీ, రన్నింగ్ రూమ్‌లో సిబ్బందికి అందిస్తున్న సౌకర్యాల పై దృశ్య మాధ్యమం ద్వారా మీడియాకు వివరించారు. ఈ క్రూ బుకింగ్ లాబీ రన్నింగ్ స్టాఫ్‌ను డ్యూటీకి తీసుకోవడానికి కేంద్రంగా పనిచేస్తుందన్నారు. డ్యూటీని చేపట్టే ముందు, లోకో పైలట్‌లు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ నిర్వహించి, 'నో సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్ ’ పై ప్రమాణం చేయాలన్నారు. అలాగే రైళ్లు సాఫీగా, సురక్షితంగా నడుస్తున్నాయని నిర్ధారించడానికి వారికి అందుబాటులో ఉంచిన అన్నీ కొత్త సర్క్యులర్‌లను విధిగా చదవాలని ఆయన తెలిపారు.


Similar News