పెరిగిన ఇసుక ధరతో భారమైన సొంతింటి కల

ఇసుక ధర అమాంతం పెరిగిపోయింది. సొంతింటి కల భారమవుతుందని వాపోతున్నారు సామాన్యులు.

Update: 2024-03-04 02:09 GMT

దిశ, మాచారెడ్డి: ఇసుక ధర అమాంతం పెరిగిపోయింది. సొంతింటి కల భారమవుతుందని వాపోతున్నారు సామాన్యులు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో ఇసుక క్వారీలు లేక పోవడంతో సరిహద్దు లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న క్వారీల పైనే ఆధార పడాల్సి వస్తుంది. స్థానికంగా ఉండే ఒర్రెలు ఒంపుల్లో లభించే ఇసుక పై పోలీసు, అటవీ శాఖ ల ప్రతాపం. వెరసి ₹900 ఉన్న టన్ను ఇసుక ధర అమాంతం ₹1650 పెరిగిపోయింది. దీంతో సామాన్యులకు సొంతింటి కల భారంగా మారింది. ఆంక్షల మధ్య అక్రమంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆంక్షల మధ్య అక్రమంగా రవాణ జరగుతున్న‌ ఇసుక పై పోలీసు, అటవీ శాఖ ల నిఘా నేపథ్యంలో నే ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. గ్రామాల్లో సైతం ఇసుక కొనుగోలు చేసుకునే స్థాయికి చేరుకుంది.

ఇసుక కు ప్రత్యామ్నాయంగా రాయి పొడి(డస్ట్)

ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాల్లో ఇసుక కు బదులుగా రాయి పొడి(డస్ట్ ) వాడకం పెరిగింది. మొదట రింగులు, కుండీలు, ఇటుకలు వంటి సిమెంట్ వస్తువుల తయారీ లో మాత్రమే వాడే డస్ట్ ను ఇప్పుడు బారీ నిర్మాణాల్లో సైతం వాడుతున్నారు. పట్టణాల్లో డస్ట్ ఉపయోగం పెరిగింది. కానీ గ్రామాల్లో డస్ట్ వాడకం పై అవగాహన లేకపోవడం వల్ల ఇసుక ఆధారిత ఇండ్ల నిర్మాణాల పైనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే నాణ్యత పై సందేహాలు. ప్రభుత్వ పరంగా నిపుణులు అవగాహన కల్పిస్తే సొంతింటి కల భారం తగ్గుతుంది.

రెడీ మిక్స్‌కు పెరిగిన డిమాండ్

ఇసుక రవాణా పై ఆంక్షల నేపథ్యంలో పెరిగిన ధరలతో రెడీ మిక్స్ కు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు పట్టణాలకు పరిమితమైన రెడీ మిక్స్ గ్రామాలకు చేరడంతో డిమాండ్ పెరిగింది. రాయి పొడి, సిమెంట్ కలర్ కలుపుతారని నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉంటాయని గ్రామాల్లో రెడీ మిక్స్ వైపు వెళ్లే వారు కాదు. ప్రస్తుతం వనరుల లభ్యత కొరవడడంతో ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యం మయ్యాయి. గ్రామాల్లో ప్రభుత్వ పరంగా జరిగే సీసీ రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్ రూం‌లు డస్ట్‌తో కూడుకున్న రెడీ మిక్స్ తోనే జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇసుక, ఇటుక, రాయి, సిమెంట్, స్టీలు ధరలపై నియంత్రణ ఉంటే తప్ప సామాన్యుల సొంతింటి కల నెరవేరడం భారమే. పదవీ కాంక్ష తో ఉచిత పథకాల పై ఆధారపడ్ఠ పాలకులు ధరల నియంత్రణ పై దృష్టి పెడితే సామాన్యుల జీవితం సరళతరం అవుతుంది.


Similar News