ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచాలి
ఆర్మూర్ కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా పరిశుభ్రంగా ఉంచాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా పరిశుభ్రంగా ఉంచాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ లోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి వైద్యులపై, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కలియ తిరుగుతూ బెడ్స్, లాబ్, కిచెన్, ఇతర వార్డ్ లు పరిశీలించి ఆసుపత్రికి వస్తున్న, వెళ్తున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో గల బాత్రూంలను శుభ్రంగా ఉంచాలని, గర్భిణీ మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేయాలని డాక్టర్ల కు సూచించారు.
సాధ్యమైనంత వరకు ప్రభుత్వ దావఖానాలో మందులు ఉంటున్నాయని, లేని సందర్భంలో జనరిక్ మందులు మాత్రమే రాయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకు నేందుకు వచ్చే రోగులు మాత్రం ఎక్కువ శాతం నిరుపేదలే ఉంటారని, వారికి సరైన వైద్యం అందించి భరోసా కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగాలు వివరించాలన్నారు. ఎక్కువ శాతం నార్మల్ డెలివరీ అయ్యేందుకు వైద్యులు కృషి చేయాలని, చిన్న పిల్లలకు వైరల్ ఫీవర్ రాకుండా డాక్టర్లు తగు జాగ్రత్తలు చెప్పాలన్నారు.
ఎక్స్ రే మిషన్లు లేకుండా పేషెంట్లు ఇబ్బంది చెందుతున్నారని వైద్యులు వివరించారని, ఇంకా ఆర్మూర్ లోని ప్రభుత్వ దావఖానాలో ఏమేమి అవసరమో నివేదిక సిద్ధం చేసి తనకు అందించాలని సూచించారు. తాను నెలకు ఒకసారి ఆస్పత్రిని పరీక్షించడానికి వస్తానని, అపరిశుభ్రంగా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అంకిత్, డిప్యూటీ డీఎం హెచ్ ఓ రమేష్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ ఆస్పత్రి ఏరియా సూపరింటెండెంట్ రవి కుమార్, ఆర్థోపెడిక్ వైద్యుడు అమృతరాంరెడ్డి తదితరులు ఉన్నారు.