గణేషుని శోభాయాత్రకు భారీగా బందోబస్తు..

నిజామాబాద్ నగరంలో ఈ నెల 17న జరిగే గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా జరిపించేందుకు పోలీసు శాఖ భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తోందని, ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని బాసర మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు.

Update: 2024-09-15 12:12 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఈ నెల 17న జరిగే గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా జరిపించేందుకు పోలీసు శాఖ భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తోందని, ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని బాసర మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కల్మేశ్వర్ సింగెనావర్ తో పాటు ఐజీ మట్లాడారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం తరువాత అంత ప్రతిష్టాత్మకంగా నిజామాబాద్ నగరంలో నిర్వహించుకునే గణేషుని శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసే బాధ్యత అందరి పై ఉందన్నారు. పోలీసు శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఆ బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా గణేష్ మండళ్ల నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గణేష్ మండళ్లు వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర జరిగేలా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం సాఫీగా జరిగేలా ఆయా స్టేషన్ ల పరిధిలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు.

బందోబస్తుకు అవసరమైన చోట సిబ్బందిని నియమించామన్నారు. గణేషుని శోభాయాత్ర జరిగే మార్గంలోని అతి సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఐజీ తెలిపారు. శోభాయాత్ర మార్గంలో అదనపు సిబ్బందితో పోలీసు బందోబస్తును విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. శోభాయాత్ర మార్గంలో ఏం జరిగినా తెలిసేందుకు భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వీడియో కెమెరాలతో నిరంతరాయంగా రికార్డింగ్ కూడా చేయిస్తున్నామని ఐజీ తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు 2000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ చంద్రశేకర్ రెడ్డి తెలిపారు.

వేర్వేరు చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు..

గణేష్ మండళ్లు ఏర్పాటు చేసిన చిన్న విగ్రహాలను బాసరలోని గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని, పెద్ద విగ్రహాలను మాక్లూర్ మీదుగా నందిపేట్ మండలం ఉమ్మెడలోని గోదావరిలో నిమజ్జనం చేయాలని ఐజీ చంద్రశేకర్ రెడ్డి అన్నారు. ఆయా ప్రదేశాల్లో గణేషుల నిమజ్జనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐజీ వివరించారు. మత కల్లోలాలకు తావులేకుండా అనుమానితులను, రౌడీ షీటర్ లను ముందుగానే గుర్తించి అదుపులోని తీసుకుని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జనోత్సవంలో మత పరమైన రెచ్చగొట్టే ధోరణిలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే మతపరమైన గొడవలు సృష్టించే నేపథ్యం ఉన్న వారిని, కొందరు అనుమానితులు, రౌడీ షీటర్ లతో అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

డీజేలకు అనుమతి లేదు..

ప్రజల ఇబ్బందిని ఆరోగ్య కారణాలను దృష్ఠిలో ఉంచుకుని డీజేలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఊరేగింపు సందర్భంగా మైక్ సెట్లకు మాత్రమే అనుమతిని ఇచ్చినట్లు ఐజీ వివరించారు. ఊరేగింపులో ఈవ్ టిజింగ్, జేబు దొంగతనాలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నందున పోలీసు సిబ్బంది మఫ్టీలో ఓ టీం తిరుగుతుందన్నారు. ఊరేగింపులో జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో జేబు దొంగలు, ఈవ్ టీజర్స్ బెడద ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐజీ సూచించారు.

ఊరేగింపు సందర్భంగా నేరాలు జరుగకుండా, చైన్ స్నాచింగ్లు, జేబు దొంగతనాలు జరగకుండా నిమంత్రించేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు కూడా స్వీయ రక్షణలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలతో సహకారంతో గణేషుని శోభాయాత్ర ఎప్పటిలాగే ప్రశాంతంగా జరిగేలా చూస్తామని ఐజీ చంద్రశేకర్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సీపీ కల్మేశ్వర్ సింగెనావర్, నిజామాబాద్ అడిషనల్ డీసీపీ కోటేశ్వర్ రావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణలు పాల్గొన్నారు.


Similar News