కేసీఆర్ మాటలు, మోడీ చెప్పిన గొప్పలు.. ప్రజలకు తప్పని తిప్పలు..
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరుస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
దిశ, భీమ్‌గల్ : హాథ్ సే హాథ్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరుస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా చేస్తున్న జోడో యాత్ర లో భాగంగా భీమ్‌గల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభించారు. ఈ కర్యక్రమానికి కాంగ్రెస్ కమిటి జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భీమ్‌గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి యాత్రా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు హామీలతో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులను ప్రజలకు తెలిజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, రుణమాఫీ వంటి హామీలను మరిచిపోయాడని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ.1200 చేసిండని అన్నారు. రూ.60 ఉన్న పెట్రోల్ ధర రూ.111, రూ.50 ఉన్న డీజిల్ ధర రూ.100 పైగా పెంచారని, ఇది ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామని వెల్లడించారు. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల రూపాయలు అందిస్తామని, అసైన్డ్ భూములకు పోడు భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తామని, ధరణిలో జరుగుతున్న అవకతవకలను సరిచేస్తూ దానిని రద్దు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.
మహిళలకు రూ. 2వేల పెన్షన్ ఇస్తునే లిక్కర్ ధరలు పెంచి అదే కుటుంబంలో భర్త దగ్గర నుండి రూ.4వేలు వసూలు చేస్తున్న మోసగాడు కేసీఆర్ అని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కమిషన్ల కోసం రోడ్లు వేయడం తప్ప బస్టాండ్లో మౌలిక సదుపాయాలు చేయలేదని అన్నారు. వేల్పూర్ మండలంలో తప్పవేరే మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తే కమిషన్లు ఇవ్వలేరని, కేవలం కమిషన్లు వస్తాయని మాత్రమే రోడ్ల నిర్మాణం చేశాడని అన్నారు. రాబోయే కాలంలో ప్రశాంత్ రెడ్డి అవినీతి పనులను బయటపెడతామని మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ కుంట రమేష్, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అనంతరావు, యువజన కాంగ్రెస్ బాల్కొండ అధ్యక్షుడు నాగేంద్రబాబు, జిల్లా యువజన సెక్రెటరీ వక మహేష్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు దేశాయి కల్పన, అవినాష్, సాయిబాబా, కిషన్, చిన్నారెడ్డి, రంజిత్, మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.