గుండారం గుట్టను గుట్కాయ స్వాహా.. మొరం స్వాహా చేసిన కేసీఆర్ సేవా దళ్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1 వ డివిజన్ లో ఉన్న

Update: 2024-04-01 14:02 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1 వ డివిజన్ లో ఉన్న గుండారం గుట్ట స్వాహా అయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ఉన్న కేసీఆర్ సేవా దళ్ నేతలు గుండారం గుట్టను స్వాహా చేశారు. అక్కడ విలువైన మొరంను తరలించుకుపోయారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు సంవత్సరాలు పాటు గుట్టను తవ్వి మొరంను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఒకప్పుడు నిజామాబాద్ రూరల్ మండలంలో ఉన్న గుండారం గ్రామం 2018లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైంది. గుండారం గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు గుట్టలకు కరువు లేదు. 983, 984, 941 సర్వే నెంబర్ లలో దాదాపు 800 ఎకరాల భూమి ఉంది. అందులో గుట్టలు, పడావు భూములున్నాయి. గుండారం గ్రామం నిజామాబాద్ నగరంలో శివారు గ్రామం కావడం, అక్కడ సహజమైన మొరం, కంకర, గ్రానైట్ వనరులు ఉండడంతో అక్కడ నుంచి ఇన్ లీగల్ గా తవ్వకాలు సర్వసాధారణం.

నిజామాబాద్ నగరానికి చెందిన జర్నలిస్టులకు గుండారం గుట్ట ప్రాంతంలో పట్టాల పంపిణీ గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నగరంలోని 280 మంది జర్నలిస్టులకు 150 గజాల చొప్పున భూమి ఇవ్వడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్దమైంది. అయితే గుట్టలుగా ఉన్న భూమిని చదును చేసి పట్టాలు ఇస్తామని ప్రణాళిక సిద్ధం చేశారు. సంబంధిత జర్నలిస్టులకు కేటాయించే ప్లాట్లకు రోడ్డు, మురుగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల కోసం కోట్ల రూపాయల ఖర్చవుతుందని దాని కోసం ఏమైనా బడా సంస్థల నుంచి నిధుల సేకరణకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పుడే కేసీఆర్ సేవాదళ్ నాయకులు ముందుకు వచ్చి గుట్టను తవ్వే పనిని చేపట్టారు. దాదాపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు రెండేళ్ల పాటు మొరం తవ్వకాలను చేశారు. 6 వేల క్యూబిక్ మీటర్ల మొరాన్ని తరలించారు. అయితే ఇందులో విశేషమేమిటంటే జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో చదును చేస్తామని ముందుకు వచ్చిన కేసీఆర్ సేవాదళ్ నాయకులు గుట్ట వెనుక ప్రాంతంను చదును చేశారు. నిత్యం వందల టిప్పర్లలో మొరాన్ని తరలించారు. కోట్ల రూపాయల మొరాన్ని తరలించేందుకు జర్నలిస్టులకు ప్లాట్ల కొరకు చదును చేస్తున్నామని సాకును చూపారు. అక్కడే ఒక ప్రజా ప్రతినిధి భర్త మరో యువ నాయకుడు కలిసి మొరం తవ్వకాలను జరిపారు.

గుండారం గుట్టల నుంచి మొరాన్ని దాదాపు 6 వేల క్యూబీక్ మీటర్లను తరలించి కోట్ల రూపాయలను వెనుకేసుకున్నారు. అనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో పేరు కేసీఆర్ సేవాదళ్ నాయకులది కావడంతో అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి చూడలేదు. దానితో జర్నలిస్టులకు 11 ఎకరాల్లో స్థలాన్ని డెవలప్ మెంట్ చేసిస్తామని అందుకోసం రాళ్ళురప్పలు, గుంతలను పూడ్చివేస్తామని నమ్మబలికిన నాయకులు గుట్టవెనుక భాగాన్ని పోతంపట్టారు. ఎకరాల కొద్దీ విస్తరించిన గుట్టలను తవ్వేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలంపై జిల్లా అధికార యంత్రాంగం తర్వాత పట్టించుకోలేదు.

దాదాపు రెండు సంవత్సరాల కాలం అక్కడ తవ్వకాలు జరిపిన మొరాన్ని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన వెంచర్లతో పాటు పలు రోడ్ల కోసం తరలించి కోట్ల రూపాయలను గడించారు. వే బిల్లులు పేరిట కొన్ని రశీదులు మాత్రమే ఇచ్చి సీనరేజ్ చార్జీలు ఎగ్గొట్టిన ట్లు సమాచారం. కేవలం గుండారం వీడీసీకి రూ.18 లక్షలు ఇచ్చిన మొరం తవ్వకందార్లు ఏ మేరకు వేను కేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దాదాపు కోట్ల రూపాయల మొరాన్ని తవ్వుకుని సొమ్ము చేసుకున్న అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ప్రస్తుతం అక్కడ జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తారా, ఇవ్వరా అన్నది సందిగ్ధంలో ఉంది. జర్నలిస్టుల పేరు చెప్పి కోట్ల రూపాయల మొరంను బీఆర్ఎస్ నాయకులు తవ్వుకుని సొమ్ము చేసుకున్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Similar News