గృహ జ్యోతి కి ఆదిలోనే కష్టాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇచ్చిన హామీలలో ప్రధానమైన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడే వినియెగదారులకు తొలి నెలలో చాలా గృహాలకు జీరో బిల్లులు రాలేదు.

Update: 2024-03-04 15:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇచ్చిన హామీలలో ప్రధానమైన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడే వినియెగదారులకు తొలి నెలలో చాలా గృహాలకు జీరో బిల్లులు రాలేదు. దాదాపు జిల్లాలో 2,28,000 మందికి మాత్రమే జీరో బిల్లులు జారీ అయ్యాయి. అందుకు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులకు, విద్యుత్ శాఖ అధికారులు చేసిన అప్ లోడింగ్ లో తేడాలు రావడమే ప్రధాన కారణం. నిజామాబాద్ జిల్లాలో 4,69,000 వేల గృహాల కనెక్షన్ లు ఉన్నాయి. అందులో దాదాపు 90 శాతం విద్యుత్ కనెక్షన్లు గృహ జ్యోతి పథకం కింద అర్హులు ఉన్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికలలో ఇచ్చిన ప్రధాన హామీ గృహలకు 200 లోపు విద్యుత్ యూనిట్ల వినియోగం కలిగిన వారికి ఉచిత విద్యుత్ అందించడం. వారు కరెంటు బిల్లులు కట్ల వద్ధని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించారు. వాటిని జిల్లా అధికార యంత్రాంగం అప్ లోడ్ చేసింది. అదే డాటా ఆధారంగా ఫిబ్రవరి నెల 6 నుంచి 22 వరకు విద్యుత్ శాఖాధికారులు 200 లోపు విద్యుత్ వినియోగాదారుల వివరాలను అప్ లోడ్ కార్యాక్రమం జరిపారు. ప్రభుత్వం మార్చి 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరెంటు బిల్లులు చెల్లించకుండా జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను అదేశించారు. కానీ నిజామాబాద్ జిల్లాలో చాలా మందికి జీరో బిల్లులు బదులు కరెంటు వినియోగం బిల్లులు రావడంతో ఆందోళనచెందుతున్నారు.

    వాటిని చెల్లించాలా వద్దా అనే డైలమాలో పడ్డారు. చెల్లించకపోతే ఎక్కడ కరెంటు కట్ చేస్తారో ఏమో అని ఆందోళన పడుతున్నారు. దాంతో వారు స్థానికంగా ఉన్న కరెంటు ఆఫీస్ లకు క్యూ కట్టారు. దాంతో అధికారులు ఈ విషయంను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావండంతో బల్థియా కార్యాలయాలలో, ఎంపీడీఓ కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఐతే విద్యుత్ శాఖాధికారులు మాత్రం జిల్లాలో గృహ అవసరాలలో 200 లోపు విద్యుత్ వినియోగదారులు 90 శాతం ప్రజలకు వర్తిస్తుందని చెబుతున్నారు. దాదాపు ప్రతి నెలా 10 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు అయ్యేదని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే గృహాలకు ఉచిత కరెంటు ఇస్తామని, అందుకు జీరో బిల్లులను

     మార్చి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినా సమాచారం అప్ లోడ్ లో జరిగిన మిస్టేక్ లతో 2.28 లక్షల మందికి మాత్రమే మొదటి నెలలో విద్యుత్ శాఖ జీరో బిల్లులు జారీ చేసిందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా ప్రజా పాలనలో ఆరు గ్యారంటీ స్కీంలకు దరఖాస్తులు తీసుకుని, వాటిని కంప్యూటరీకరణ చేసినప్పటికీ గృహజ్యోతి సమాచారంలో తేడా రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కరెంటు కోతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

    గా వార్నింగ్ ఇచ్చి కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అధికారులను సస్పెండ్ చేశారు. మరి గృహ జ్యోతి దరఖాస్తుల అప్ లోడ్ కారణంగా సగం మందికి కరెంటు బిల్లులు రావడం, వారు విద్యుత్ బిల్లుల పైకం చెల్లించాలా లేదా అన్నదానిపై స్సష్టత రాలేదు. ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఖచ్చితంగా రేషన్ కార్డు ( తెలుపు) కలిగి ఉండాలని, ఆధార్ కార్డు, కరెంటు బిల్లులతో కలిపి హెల్ప్ డెస్క్ కేంద్రాలలో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖాధికారి రవీందర్ తెలిపారు. తమ వద్ధ ఎలాంటి పొరపాటు జరుగలేదని తెలిపారు.


Similar News