అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాల దందా
దుబ్బాకు చెందిన పంచ రెడ్డి శ్రవణ్ అనే వ్యక్తి మరో నలుగురి వ్యక్తితో కలిసి 2020లో పట్టాల దందాకు తెరలేపాడు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దుబ్బాకు చెందిన పంచ రెడ్డి శ్రవణ్ అనే వ్యక్తి మరో నలుగురి వ్యక్తితో కలిసి 2020లో పట్టాల దందాకు తెరలేపాడు. స్థానికంగా ఉన్న పలుకుబడితో ఒక కార్పొరేటర్ భర్తను, మరొక వ్యక్తితో ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడితో కలిసి ఈ తతంగానికి తెర లేపాడు. దానికి గాను శ్రవణ్ మిత్రుడు తీసుకువచ్చిన పేదలను ముఖ్యంగా బీడీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్క పట్టాను లక్షా 50 వేలకు విక్రయించారు. వారికి గిరిరాజ్ కళాశాల చెంత ఉన్న భూమి మీకు కేటాయించిందంటూ నమ్మబలికారు. ఇటీవల కాలంలో అక్కడ ప్రభుత్వం మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూముల విషయంలో పెన్సింగ్ చేయడంతో దాన్ని కాదని మీకు ఇతర ప్రాంతాల్లో భూమి చూపిస్తామని నమ్మబలికారు.
బాధితులు అనుమానంతో రెవెన్యూ అధికారులను సంప్రదించడంతో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో 2019లో ఇచ్చిన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్‌ల కారణంగా భూములు లేకున్నా కేవలం ఇంటి నంబర్ల ఆధారంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం రద్దు చేసింది. నగరంలో నే 3 వేల పైచిలుకు సెల్ఫ్ అసెస్మెంట్ ఇంటి నంబర్లను రద్దు చేశారు. దాని కారణంగా పేదలు దుబ్బ ప్రాంతంలో మోసపోయిన బీపీఎల్ కేటగిరిలో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన పట్టా భూముల రిజిస్ట్రేష న్ రద్దయ్యాయి. దాంతో వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేయకుండా అధికార పార్టీ లీడర్లతో ఒత్తిడి తెచ్చారు. దానిపై వారు కాంప్రమైజ్ చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కేసు నమోదు ఆలస్యమైంది. చివరకు బాధితులు తమకు న్యాయం జరగదని కోర్టును ఆశ్రయించడంతో పంచ రెడ్డి శ్రవణ్‌తో పాటు మరో వ్యక్తిపై చీటింగ్ కేసుతో పాటు ఫోర్జరీ సెక్షన్ల కింద నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఎవరిని కూడా పోలీసులు విచారణ చేయకముందే రాజీ కొరకు ప్రయత్నాలు జరిగినా కొలిక్కి రాలేదు.
దుబ్బాలోని పేదలకు ముఖ్యంగా బీడీ కార్మికులకు సెల్ఫ్ అసెస్మెంట్ ఇంటి నెంబర్ల ఆధారంగా గతంలో ఇచ్చిన పట్టాల పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్లను సక్రమం చేసేందుకు దుబ్బా గ్యాంగ్ కొత్త ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బైపాస్ రోడ్డు అవతల ఉన్న 171 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలో స్థలాలు ఇప్పిస్తామని కొత్త నాటకానికి తెర లేపారు. కబ్జాలో ఉన్న పేదలకు భూములను రెగ్యులరైజ్ చేయాలని కొత్త నాటకానికి తెర తీశారు. ఇటీవల ప్రభుత్వం జీవో 58 ఆధారంగా పేదలు ఆక్రమించుకున్న, కబ్జాలో ఉన్న సర్కారు అసైన్డ్ భూముల్లోని ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
అవకాశంగా తీసుకొని మీ సేవాల ద్వారా మరోసారి సంబంధిత భూమిని పేదల పేరుతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురైదుగురు గ్యాంగ్‌గా ఏర్పడి రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ తతంగాన్ని నడిపినట్లు స్పష్టమవుతుంది. మున్సిపల్ అధికారులు సెల్ఫ్ అసెస్మెంట్ ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని చేతులు దులుపుకున్నారు. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. 2005 నుంచి 2008 ప్రాంతంలో పేదలకు ఇచ్చిన పట్టాల వివరాలు లేవని సైడ్ అయిపోతున్నారు. దుబ్బకు చెందిన గ్యాంగ్ సుమారు 50 మంది వద్ద కోటికి పైగా వసూల్ చేసి అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ భర్త అండతో తప్పించుకునేందుకు ఇప్పటికి ప్రయత్నిస్తుండటం విశేషం.