రైతు పక్షపాతి కేసీఆర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశ మయ్యారు.
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశ మయ్యారు. తెలంగాణ రైతు పథకాలపై వారు కూలంకషంగా చర్చించారు. కోట పాటి నర్సింహం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రఘునాథ్ దాదా పాటిల్ (మహరాష్ట్ర శేత్కారి సంఘటన్), రాఘవేంద్ర కుమార్ (ఉత్తర ప్రదేశ్ క్రిషి భూమి బాచఓ మోర్చ), సేవాసింగ్ ఆర్యా (హర్యానా బీకేయు), కేఎం రామ గౌందర్ (తమిళనాడు తమిళ్ వ్యవసాయ సంఘం), పరశురాం లక్ష్మణ్ (కర్నాటక ఫర్మార్స్ అసోసియేషన్స్ ఆఫ్ కర్నాటక), కోటపాటి నర్సింహం నాయుడు (తెలంగాణ సౌత్ ఇండియన్ ఫార్మాస్ ఫెడరేషన్ అధ్యక్షులు), డా.మంగి రామ్ (హర్యానా), నాగరాజు (కర్నాటక) అన్నుమాంతరాసు (తమిళనాడు), బాల సాహెబ్ వాడ్కే (మహారాష్ట్ర) తో పాటు పలువురు స్థానిక రైతులు హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గ్యారెంటీలు అని అబద్ధాలు చెప్తుందని కర్ణాటకలో తాము నమ్మి ఓట్లు వేసి మోస పోయామని కర్ణాటక రైతు సంఘ నాయకుడు పరుశురాం లక్ష్మణ్ అన్నారు. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని అది కూడా అర్థరాత్రి ఇస్తున్నారని కర్ణాటకలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టారని, కరెంట్ బిల్లులు కడుతున్నమని, సాగునీటి పన్ను ఏడాదికి 12 వేలు కడతామని, కానీ ఇక్కడ కేసీఆర్ రైతులకే 10వేలు ఇస్తున్నారని కొనియాడారు. శేత్కారి సంఘటన్ నాయకులు రఘునాథ్ దాదా పాటిల్ మాట్లాడుతూ రైతు కోసం కేసీఆర్ లా ఆలోచించే నాయకుడు దేశంలోనే ఎవరూ లేరన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని నినదించిన ఏకైక రాజకీయ నాయకుడు కేసీఆర్
అని మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రైతు సంఘాల నాయకులు కొనియాడారు. కేసీఆర్ ను కాదనుకుంటే తినే పళ్లెంలో మన్ను పోసుకున్నట్టే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ గొప్పలకు పోతుందని, వాళ్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులను అరిగోస పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసానికి కర్ణాటక రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల గోసలు అనేకమన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశ వ్యవసాయ ముఖ చిత్రమే మారి పోతుందని అన్నారు. కేసీఆర్ గెలిస్తే రైతు గెలిచినట్టే అని మంత్రి వేముల అన్నారు.