కుక్కల జనాభా తగ్గించడానికి అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు

వీధి కుక్కల జనాభా తగ్గించడానికి (సంతానోత్పత్తి) కామారెడ్డి పట్టణంలోని రామేశ్వరపల్లిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు.

Update: 2024-03-20 14:09 GMT

దిశ, కామారెడ్డి : వీధి కుక్కల జనాభా తగ్గించడానికి (సంతానోత్పత్తి) కామారెడ్డి పట్టణంలోని రామేశ్వరపల్లిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘ సమావేశంలో మాట్లాడుతూ... కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి లలో కూడా ఈ కుటుంబ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాలను నడిపించేందుకు అవసరమైన నిధుల కోసం మున్సిపాలిటీ మాత్రమే గాక జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

     కుక్కల ప్రేమికులు తమ పెంపుడు కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలతో పాటు రేబిస్ వ్యాక్సిన్ వేయించి కుక్క కాటు, కుక్కల నియంత్రణకు పాటుపడాలని కోరారు. మూగజీవాలు, వీధి కుక్కలను హింసించుట, వేధించుట చేయరాదని, వాటిని చంపరాదని, చనిపోయిన కళేబరాలను తరలించడంలో మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవిలో జంతువులు, పక్షుల దాహార్తికి ఆరు బయట నీటి సదుపాయం, గింజలు, ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు చెత్తను బయట వేయరాదని సూచించారు.

    జంతువులను కాపాడేందుకు ప్రభుత్వం చట్టాలు చేసిందని, వాటిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అన్నారు. జంతువులను రవాణా చేసేటప్పుడు బాధ కలిగించకుండా జాగ్రత్తగా తరలించాలని, జంతు హింస నివారణ నిబంధనలు పాటించాలన్నారు. విద్యార్థులను పశు వైద్య కేంద్రాలకు తీసుకెళ్లి మూగజీవాలకు అందిస్తున్న వైద్య సహాయం, జంతు సంరక్షణపై అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి సింహారావు, సభ్యులు క్యాతం సిద్దిరాములు, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, జెడ్పీ డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీఈఓ రాజు, వాణిజ్య పన్నుల అధికారి రవి కుమార్, ఎస్ఐ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News