దోస్తానా ఎవరితో..? ఆసక్తికరంగా మజ్లీస్ రాజకీయం
పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మరెక్కడా పోటీ చేయని ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతుందోనని చర్చనీయాంశంగా మారింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మరెక్కడా పోటీ చేయని ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతుందోనని చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్‌తో జతకట్టిన మజ్లీస్ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్‌తో ప్రస్తుతం చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో పతంగి పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మజ్లీస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్‌కు మరికొందరు బీఆర్ఎస్ కు మద్దతు పలికారు. బోధన్‌లో సుదర్శన్ రెడ్డి గెలుపులో, అర్బన్‌లో షబ్బీర్ ఆలీ రెండో స్థానం రావడంలో మజ్లీస్ పార్టీ నాయకుల హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. ఇప్పటి వరకు ఎంఐఎం అధినేత పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు బహిరంగంగా ప్రకటించకపోయినా స్థానిక లీడర్లు మాత్రం మజ్లీస్ మద్దతు కోసం తహతహలాడుతున్నారు.
హైదరాబాద్ తర్వాత మజ్లీస్ పార్టీ బలంగా ఉన్నది నిజామాబాద్ జిల్లాలో మాత్రమే. నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ తో పాటు 16 మంది కార్పొరేటర్లు ఉండగా, బోధన్ లో 8 మంది కౌన్సిలర్లు, ఆర్మూర్‌లో ఏకైక కౌన్సిలర్ ఉన్నారు. నిజామాబాద్, బోధన్‌లో మజ్లీస్ పార్టీ మద్దతు ఉన్న వారికే బల్ధియాపై జండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుంది. గడిచిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ బల్ధియాలో బీజేపీ 29 మంది కార్పొరేటర్లు గెలిచినప్పటికీ అక్కడ బలమైన మజ్లీస్ పార్టీ 16 మంది కార్పొరేటర్లు ముకుమ్మూడిగా బీఆర్ఎస్‌కు మద్దతు తెలుపడంతో 13 స్థానాలను గెలిచిన బీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. బోధన్ లోనూ మజ్లీస్ మద్దతుతోనే బీఆర్ఎస్ బోధన్ మున్సిపల్‌ను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లీస్ మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు విశ్వ ప్రయత్నాలు చేశారు.
దశాబ్ధ కాలంగా బీఆర్ఎస్‌తో పతంగి పార్టీ దోస్తాని చేయడంతో అసెంబ్లీ ఎన్నికల వరకు అది కొనసాగింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ అధినేత ఆదేశాల కన్నా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక లీడర్లు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు రావడంతో గెలుపొటములపై మాట్లాడేందుకు ఆ పార్టీ నాయకులెవ్వరు ఆసక్తి చూపలేదు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలుపాలని దారుసలాం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎంఐఎం నాయకులతో, కార్పొరేటర్లతో గడిచిన వారం సమావేశమయ్యారు. తనకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ మైనార్టీ నాయకులతో కలిసి రాయబారం నడిపారు.
అది గడిచి వారం రోజులు కాకముందే ఈ నెల 27న ఎంఐఎం కార్పొరేటర్లు మజ్లీస్ పార్టీ జిల్లా నాయకత్వం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణష్ గుప్తతో భేటీ అయ్యారు. అక్కడ కూడా తమకు మద్దతు కావాలని కారు పార్టీ నాయకులు పతంగి పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. అయితే మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ఆయన ఆదేశాలను పాటిస్తామని మజ్లీస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పతంగి పార్టీకి బీజేపీకి మొదటి నుంచి వైరం కొనసాగుతున్న విషయం తెల్సిందే. పచ్చ పార్టీకి కారు లేదా చేతి గుర్తు పార్టీతోనే దోస్తానా అనేది చాలా రోజులుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో బలంగా ఉన్న ఎంఐఎం మద్దతు కూడగట్టుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఖరు వరకు పతంగి పార్టీ అధినేత ఎవరికి మద్దతు తెలుపుతారనోనని ఇక్కడి నాయకులు ఎంత మేరకు ఆదేశాలు పాటిస్తారోననేది వేచి చూడాల్సిందే.