మహిళలందరూ ఆరోగ్య మహిళా ప్రోగ్రాం ని సద్వినియోగం చేసుకోవాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగపరుచుకోవాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగపరుచుకోవాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం ఆర్మూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా ప్రోగ్రాంను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన మహిళలలో వచ్చు ఆరోగ్య సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి మంగళవారం సుమారు 46 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులను వైద్య సిబ్బంది అందజేస్తారన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా రాష్ట్రప్రభుత్వం ప్రారంభించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని 18 ఏళ్లు పైబడిన మహిళలందరూ వినియోగించుకోవాలన్నారు. ప్రతి మంగళవారం పట్టణ ఆరోగ్య కేంద్రానికి పరీక్షలు చేయించుకునేందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రమేష్, డాక్టర్ మానస, ఆరోగ్యాధికారులు సాయి, చంద్రశేఖర్ , అనురాధ, పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.