అంతా మా ఇష్టం.. కావాల్సినోళ్ళకు కోరిన చోట పోస్టింగ్..

పదేళ్లుగా ఒకేచోట విధులు.. వారిని బదిలీ చేసేందుకు మనసొప్పని అధికారులు.. కావాల్సిన వారికి కోరిన చోట పోస్టింగ్.. నచ్చనోళ్ళకు దూర ప్రాంతాల్లో విధులు.. మండలానికి చెందిన వ్యక్తికి ఆ మండలంలో పోస్టింగ్ ఇవ్వొద్దని తెలిసినా మనోడే అంటూ పోస్టింగ్ ఇవ్వడం ఆ శాఖలో పరిపాటిగా మారింది.

Update: 2024-07-15 16:25 GMT

దిశ, కామారెడ్డి : పదేళ్లుగా ఒకేచోట విధులు.. వారిని బదిలీ చేసేందుకు మనసొప్పని అధికారులు.. కావాల్సిన వారికి కోరిన చోట పోస్టింగ్.. నచ్చనోళ్ళకు దూర ప్రాంతాల్లో విధులు.. మండలానికి చెందిన వ్యక్తికి ఆ మండలంలో పోస్టింగ్ ఇవ్వొద్దని తెలిసినా మనోడే అంటూ పోస్టింగ్ ఇవ్వడం ఆ శాఖలో పరిపాటిగా మారింది. తమకు అనుకూలంగా లేని వారిని కారణం లేకుండానే బదిలీ చేసేస్తున్నా అడిగే నాధులే లేరు. దాంతో ఆ శాఖ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు తయారైంది. గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారుల తీరుతో ఉపాధి ఉద్యోగులకు బదిలీలు లేవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సొంత మండలాల్లో పోస్టింగ్..

సాధారణంగా గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రతి మండలంలో సీఓ (కంప్యూటర్ ఆపరేటర్), టీఏ (టెక్నికల్ అసిస్టెంట్), ఏపీఓ (అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్), ఈసీ (ఇంజనీరింగ్ కన్సల్టెంట్) ఉంటారు. అయితే వీరికి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వవద్దని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. అయితే కొంత మంది ఉద్యోగులకు ఒకే మండలంలో పనిచేసే అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన నరేందర్ కు ఇతర మండలంలో ఏపీఓగా ఇవ్వాల్సి ఉన్నా కామారెడ్డి మండలానికే ఏపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆయన సీనియర్ ఏపీఓ అయినప్పటికీ చిన్న మండలమైన కామారెడ్డి ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా జిల్లాలో అనేక మందికి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇచినట్టుగా సమాచారం. తమకు అనుకూలంగా ఉండేవారిని సొంత మండలంలో అవకాశం కల్పిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

పదేళ్లుగా ఒకే చోట..

శాఖ ఏదైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్లు లేదా ఐదేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఈ నిబంధన వర్తించదు అని ప్రచారం సాగుతోంది. ఒకే మండలంలో పదేళ్లుగా పని చేస్తున్న ఏపీఓ, టీఏ, ఈసీ, సీఓలను మార్చకుండా ఇతర ఉద్యోగులను ఇష్టారీతిన మారుస్తున్నట్టుగా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధారి మండలంలో టీఏ ప్రసాద్ దాదాపుగా పదేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. అతనికి మండలం పై పూర్తి పట్టు ఉండటంతో పాటు ఇటు ఉన్నతాధికారులను, అటు కూలీలు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని పదేళ్లుగా కదలకుండా పాతుకుపోయారన్న ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అతన్ని బదిలీ చేయకుండా ఇదే మండలంలో పని చేసిన సీనియర్ ముగ్గురు టీఏలను ఇతర కారణాలతో బదిలీ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇలా అనేక మండలాల్లో పదేళ్లుగా పాతుకుపోయిన వారిని కాకుండా ఇతర ఉద్యోగులను బదిలీ చేశారు. తాడ్వాయి మండలంలో ఏపీఓగా పని చేసిన శ్రీనివాస్ ను ఏ కారణం లేకుండా కొందరి చెప్పుడు మాటలు విని నిజాంసాగర్ బదిలీ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. లింగంపేట ఏపీఓ, బిచ్కుంద ఈసీలు అధికారులకు అనుకూలంగా లేకపోవడంతో చాలా రోజుల పాటు దూర ప్రాంతాలకు మార్చారన్న ఆరోపణలున్నాయి.

ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే...

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల బదిలీల పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటుంది. ఏ ఉద్యోగి పై ఉన్నతాధికారికి కోపం వస్తుందో.. ఎవరిని ఎక్కడికి బదిలీ చేస్తారోనని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీ చేయాల్సిన వారిని అక్కడే ఉంచి ఇతరులను బదిలీ చేయడం పట్ల పేరు రాయడానికి ఇష్టపడని కొందరు ఉద్యోగులు "దిశ"తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో అకారణంగా బదిలీలు, ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసే అంశం పై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇకనైనా గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు జరిగేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.

సాధారణ బదిలీలు లేవు... చందర్ నాయక్, పీడీ

గ్రామీణాభివృద్ధి శాఖలో సాధారణ బదిలీలు లేవు. ఉపాధి హామీలో ఎవరైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే, పనితీరు బాగులేని వారిని బదిలీలు చేయడం తప్ప సాధారణ బదిలీలు లేవు. ప్రభుత్వం నుంచి బదిలీల విషయమై ఎలాంటి ఆదేశాలు లేవు.


Similar News