పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి.. సీఐటీయూ

గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

Update: 2024-06-26 13:06 GMT

దిశ, కామారెడ్డి : గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ ఉద్యోగ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనాలు అమలు చేయాలని, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించి సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేయాలని, పంచాయతీ సిబ్బందికి దహన ఖర్చులకు 10 వేల రూపాయల నుండి 20 వేల రూపాయలకు పెంచాలని కోరారు. అలాగే విధి నిర్వహణలో చనిపోయిన పంచాయితీ సిబ్బందికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాజన్న, శ్యాం, స్వామి, బాలనర్సు, మల్లేష్, రవి, రాజారాం, సాయిలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News