ధరణి, సీఎం ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్

ధరణి, ప్రజావాణి ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు.

Update: 2024-06-20 14:31 GMT

దిశ, కామారెడ్డి : ధరణి, ప్రజావాణి ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... ధరణి, సీఎం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరీ, సిసిఎల్ఎ కమీషనర్లు ధరణి, ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తరచూ సమీక్షిస్తున్నారని గుర్తుచేశారు. గత మార్చి లో స్పెషల్ డ్రైవ్ చేపట్టినా ధరణిలో పెండింగ్ మ్యుటేషన్స్, సక్సెసన్స్ చాలా ఉండడంపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఈ నెలాఖరులోగా అన్ని డిస్పోజ్ కావాలని, అంతవరకు ఎలాంటి సెలవులు లేవని అన్నారు.

చక్కటి కార్యాచరణతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోజు 40 నుండి 50 కేసులు డిస్పోజ్ అయ్యేలా ఆర్.డి.ఓ. లు, తహసీల్ధార్లతో మానిటరింగ్ చేయాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కు సూచించారు. అన్ని విధాలా దరఖాస్తులు పరిశీలించి ఖచ్చితత్వంతో నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్న కుల, ఆదాయ, రెసిడెన్షియల్ ధ్రువపత్రాలను పరిశీలించి జారీ చేయాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి ఆర్.డి.ఓ.లు, తహసీల్ధార్లకు లాగిన్ లు పంపామని, వాటి ని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

దరఖాస్తు తిరస్కరణ లేదా పరిష్కరించక పోవడానికి సాహేతుకమైన కారణాలుంటే ఫిర్యాదుదారులకు సకాలంలో తెలపాలని, ఎట్టి పరిస్థితుల్లో తమ వద్ద అనవసరంగా పెండింగ్ లో పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పరిష్కరించిన వినతులను prajavanisno@gmail.com లో వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ నమోదు చేయాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ సమీక్షిస్తానని, ప్రగతి లేకుండా తగు చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ లు రంగనాథ రావు, రమేష్ రాథోడ్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, మసూర్ అహ్మద్, కలెక్టరేట్ సూపెరింటెండెంట్లు పాల్గొన్నారు.


Similar News