డీఈవో పక్షపాత వైఖరిని ఖండిస్తున్నాం.. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్
జిల్లా విద్యాశాఖ అధికారి తప్పు చేసిన వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో పక్షపాతం, కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నాడని, దానిని ఖండిస్తున్నామని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రాజన్నలు అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా విద్యాశాఖ అధికారి తప్పు చేసిన వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో పక్షపాతం, కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నాడని, దానిని ఖండిస్తున్నామని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రాజన్నలు అన్నారు. ఇటీవల జరిగిన రెండు సంఘటనల నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వచ్చిన మరుక్షణమే సస్పెన్షన్ వేటు వేయవలసిన తన కార్యాలయం సిబ్బంది (ఎస్టాబ్లిష్మెంట్ జూనియర్ అసిస్టెంట్) అస్రార్ విషయంలో మిన్నకుండడం సరికాదని అన్నారు. ఏకంగా జిల్లా విద్యాశాఖ అధికారికి రూ.5000 లంచం ఇస్తే డిప్యూటేషన్ ఆర్డర్ రద్దు చేయిస్తానని వాయిస్ రికార్డింగ్ వైరాలైనప్పటికీ ఈ రికార్డింగ్ ను ఉపేక్షించడంలో పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.
లంచం అడిగిన వ్యక్తికి డీఈవో బాసటగా నిలవడం విమర్శలకు తావిస్తుందన్నారు. పెట్టిన డిప్యూటేషన్లు కూడా పూర్తిగా అక్రమం ఇటువంటి ఉత్తర్వులు వెలువడుటకు కారకులైన వారి పై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం డీఈఓ పక్షపాత వైఖరిని తెలియజేస్తుంది. ఎస్ఎంసీ తీర్మానం మేరకు యూనిఫాంలు కుట్టడానికి కొంత మొత్తం విద్యార్థుల నుండి వసూలు చేశాడని పడగల్ ప్రధాన ఉపాధ్యాయున్ని ఆగమేఘాల మీద సస్పెండ్ చేయడం సరైంది కాదు అన్నారు. ఈ విషయంలో డిపార్ట్మెంటల్ విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అత్యుత్సాహం ప్రదర్శించి సస్పెండ్ చేయడాన్ని డీటీఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
సదరు ప్రదానోధ్యాయుడు ఒక ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర నాయకుడిగా, యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి విద్యాశాఖలో అవినీతి అక్రమాలను ఖండిస్తు యూఎస్పీసీ పక్షాన ఫిర్యాదులు చేస్తున్నాడనే అక్కసుతోనే ప్రతికార ఈ సస్పెన్షన్ చర్యగా అగుపిస్తుంది అని తెలిపారు. నిజానికి ఆఫీస్ సబార్డినేట్ గంగాధర్ తో సంభాషించిన వాయిస్ రికార్డింగ్ బయటకు రావడం అంటే ఇకముందు అవినీతి అక్రమార్కులకు హెచ్చరికగా పరిగణించాలి అన్నారు. అంతేకాకుండా ఆఫీస్ సబార్డినేట్ గంగాధర్ ను అభినందించాలి కాని గంగాధర్ ను మానసికంగా వేధించేందుకు పలు రకాల షోకాజులు, మెమోలు, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జిల్లా విద్యాశాఖ అధికారి ఇవ్వడం పట్ల ఖండిస్తున్నాం అన్నారు. గంగాధర్ పై వేధింపులను మాని తక్షణమే అక్రమ డిప్యూటేషన్లకు కారకులైన జిల్లావిద్యాశాఖ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.