తప్పును పోలీసు పైకి తోసిన ఢిల్లీ వాలా స్వీట్స్.. ఫ్లెక్సీ ఏర్పాటుపై విసుర్లు
ఢిల్లీ వాలా స్వీట్ హోం.. ఈ పేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఢిల్లీ వాలా స్వీట్ హోం.. ఈ పేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కానేకాదు.. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఢిల్లీ వాలా స్వీట్ హోం అంత ఫేమస్..అలాంటి ఎన్నడూ లేనిది ఆదివారం అర్ధాంతరంగా మూసేశారు.. మామూలుగా మూసేశారనుకుంటే.. అది కాదు.పోలీసుల వేధింపులు భరించలేక షాపును మూసేశామని షాపు ముందు ఫ్లెక్సీ తగిలించి మరీ మూసేశారు.ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వివరాల్లోకి వెళితే.. సోమవారం రాఖీ పండుగ.. అన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టి స్వీట్ తినిపిస్తారు. దీని కోసం ఢిల్లీ వాలా స్వీట్ హోం వద్ద స్వీట్ కోసం తండోప తండాలుగా జనం పోటెత్తారు. అత్యంత రద్దీగా ఉండే ఇరుకు రోడ్డు పక్కన షాప్ ఉండటంతో స్వీట్స్ కోసం వచ్చిన వారు వాహనాలను షాపు ముందు పార్క్ చేస్తారు.
దీంతో రోడ్డు దాదాపు బ్లాక్ అయినంతగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రజలకు, ట్రాఫిక్ ఇబ్బందులేర్పడతాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేయడం కూడా పోలీసులకు ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్య దాదాపు స్వీట్స్ తో ముడిపడి ఉండే రాఖీ పండుగ, దీపావళి పండగ వంటి రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. దీని కోసం పోలీసులు చెప్పక మునుపే షాపు నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా రద్దీ లేని ఏదైనా ఇతర ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిపోయి, షాపు యాజమాన్యం పోలీసుల వేధింపుల కారణంగా షాపును కట్టేశామని ఫ్లెక్సీ పెట్టీ మరీ పోలీసుల్ని బద్నాం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేయరని, సమాజం కోసం, సమాజ హితం కోసం డ్యూటీ చేసే వారిని ఈ రకంగా ఫ్లెక్సీ పెట్టీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నగర ప్రజలు అంటున్నారు.