అప్లై చేయకున్నా.. ఇంటి అడ్రస్ కు డెబిట్ కార్డులు..

బ్యాంకులకు వెళ్లి.... అప్లై చేయకుండానే... స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరిన డెబిట్ కార్డులను చూసి నిరుపేదలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Update: 2024-06-26 16:07 GMT

దిశ, భిక్కనూరు : బ్యాంకులకు వెళ్లి.... అప్లై చేయకుండానే... స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరిన డెబిట్ కార్డులను చూసి నిరుపేదలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మీ దేవుని పల్లి గ్రామానికి చెందిన కొత్త పద్మ, కత్తుల ప్రణయ్, కొత్త సంతోష్, కొత్త బాబులకు ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి నాలుగు డెబిట్ కార్డులు పోస్ట్ ద్వారా ఇంటి అడ్రస్ కు వచ్చాయి. అయితే కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి డెబిట్ కార్డులు రావడంతో బుధవారం సాయంత్రం తమ ఖాతాలు ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి ఈ డెబిట్ కార్డులను చూపించి ఎంక్వయిరీ చేశారు. అయితే కొత్త పద్మ స్థానికంగా భిక్కనూరు మండల కేంద్రంలో తమ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఈ డెబిట్ కార్డును చూపించింది. ఈ డెబిట్ కార్డు మా బ్యాంకుకు సంబంధించినది కాదని, ఇది చెల్లదని బ్యాంకు సిబ్బంది చెప్పేశారు. మిగతావారుకూడా ఆయా ఖాతాలు ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి డెబిట్ కార్డులు చూపించగా, వారు కూడా అదే సమాధానం చెప్పడంతో నివ్వెరపోయారు.

ఒకసారి ఎందుకైనా మంచిదని డెబిట్ కార్డులు పంపించిన బ్యాంకు నెంబర్ల ఆధారంగా ఫోన్ లో సంప్రదించగా అకౌంట్ ట్రాన్జక్షన్ నడుస్తుందని హిందీలో చెప్పడంతో, డెబిట్ కార్డులు వచ్చినవారు భయపడిపోయారు. అంతటితో ఊరుకోకుండా డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే కత్తుల ప్రణయ్ ఒక ఏటీఎంకు వెళ్లి డెబిట్ కార్డు పెట్టి చూడగా, ఆ ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నప్పటికీ పిన్ కోడ్ అడగడంతో పాటు, ఫోన్ నెంబర్ అడగడంతో వెంటనే కార్డును వెనక్కి తీసేసుకున్నాడు. ఒకవేళ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే, తన అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయమై ఉండేవని వాపోయాడు. పేరు ఇంటి అడ్రస్ కరెక్ట్ గానే ఉన్నప్పటికీ, ఫోన్ నెంబర్లు మరొకరివి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి ఆ నెంబర్లకు కూడా ఫోన్ కలుపగా ఈ నెంబర్ మనుగడలో లేదని వాయిస్ రికార్డ్ రావడం, డెబిట్ కార్డుల ద్వారా ఇదో తరహా మోసానికి సైబర్ క్రైమ్ నేరస్తులు పాల్పడుతున్నారన్న అనుమానంతో సాయంత్రం స్థానిక భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు.

Similar News