ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా
కేంద్ర, రాష్ష్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో నిజామాబాద్ లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర, రాష్ష్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో నిజామాబాద్ లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అటు నుంచి కలెక్టరేట్ వద్దకు వెళ్లి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల బడ్జెట్ లో తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మించామని, కానీ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ లో కూడా సరైన ప్రాజెక్టుగానీ, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలుగానీ నిర్మించకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో నిజామాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల సాగుకు గుత్ప, అల్లి సాగర్ ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. కానీ టీఆర్ఎస్ పాలకులు కమీషన్ల కోసమే పని చేస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీదలకు ఇచ్చిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ లో పేదల భూములు చూపెట్టడం లేదని ఒకరి భూమి మరొకరి పేరు మీద చూపిస్తుందని, కావున ధరణి పోర్టల్ ను పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరారు. మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేనిర్వహించారని అందులో బీసీలు 50 శాతం ఉంటే వారికి 23 శాతం రిజర్వేషన్ కల్పించడం అన్యాయమన్నారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రజలకు 13 శాతం నుండి 27శాతం వరకు రిజర్వేషన్ పెంచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇంచార్జ్ తాహిర్ బీన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, నరాల రత్నాకర్, కార్పొరేటర్ గడుగు రోహిత్, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.