కొనుగోలు కేంద్రం వద్ద రాజకీయం.. ఇరుపార్టీల నాయకుల మధ్య ప్లెక్సీ రగడ...
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ పర్యటనలో రాజకీయ రగడ జరిగింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ పర్యటనలో రాజకీయ రగడ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, అధికారులతో ధాన్యం కొనుగోళ్ల పై సమీక్ష సమావేశం కోసం జూపల్లి గురువారం నిజామాబాద్ వచ్చారు. ముందుగా ఆయన రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అనంతరం అక్కడి నుండి ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించడానికి వచ్చారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు జూపల్లి వచ్చారు. మంత్రి రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో బీజెపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టకపోవడం పై కాంగ్రెస్ నాయకులను, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల పై కూడా బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఫ్లెక్సీ వివాదం బీజెపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించి శాంతింపజేశారు.