పట్టా ల్యాండ్‌లో డంపింగ్ యార్డ్ కట్టారా...?

అప్పట్లో ఏడి సర్వే చేయగా అసైన్డ్ ల్యాండ్ లో డంపింగ్ యార్డ్ కట్టారని

Update: 2024-11-14 11:12 GMT

దిశ, భిక్కనూరు : అప్పట్లో ఏడి సర్వే చేయగా అసైన్డ్ ల్యాండ్ లో డంపింగ్ యార్డ్ కట్టారని తేలింది. తాజాగా నిర్వహించిన సర్వేలో పట్టా ల్యాండ్ లో కట్టారని తేలడంతో అధికారులు విస్మయానికి గురైన వైనం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జంగంపల్లి శివారులోని కంకర ప్లాంట్ ఆపోజిట్ లోని 221 సర్వే నెంబర్ లో 6 ఎకరాల 8 గుంటల పట్టా ల్యాండ్ స్థలం ఉంది. అయితే ఇది పట్టా ల్యాండ్ కాదని, అసైన్ ల్యాండ్ అని కోట్ల విలువ చేసే ఈ భూమిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అప్పటి అధికారుల ఆదేశానుసారం తహసీల్దార్ ఏడితో సర్వే చేయించగా, డంపింగ్ యార్డ్ అసైన్డ్ ల్యాండ్ లోనే కట్టారని తేలింది. పట్టాదారులు అసైన్డ్ ల్యాండ్ కాదని, పట్టా ల్యాండేనని చెబుతూ, అప్పటి ప్రభుత్వం అధికారం కోల్పోయి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికారులను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఏ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే చేయగా పట్టా ల్యాండ్ లోనే డంపింగ్ యార్డ్ కట్టారని సూచనప్రాయంగా తెలిసింది.

237 సర్వేనెంబర్ అసైన్డ్ ల్యాండ్ లో కట్టాల్సిన డంపింగ్ యార్డ్ ను పట్టా ల్యాండ్ లో కట్టి అధికారులు పొరపాటు చేసి ఉంటారా అన్న అనుమానాన్ని అక్కడికి వచ్చిన అధికారులు చర్చించుకోవడం కనిపించింది. ఈ సర్వేకు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు తో పాటు, కామారెడ్డి ఆర్డీవో రంగనాథ్ హాజరయ్యారు. సర్వే పూర్తయిన తరువాత ఆర్డిఓ రంగనాథ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ సర్వే తో సాటిస్ ఫై అయ్యారా అంటూ పట్టాదారులను ప్రశ్నించగా, ఇది ఫోర్త్ టైం సార్ అంటూ సమాధానం ఇచ్చారు. సర్వే రిపోర్టుపై ఫైనల్ డెసిషన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాం గ్వాన్ తీసుకుంటాడని, అప్పటివరకు మనం వెయిట్ చేయాల్సిందేనని వివరించారు. సర్వే పూర్తయిన అనంతరం అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. ఈ సర్వేలో కామారెడ్డి డీఎల్పీ ఓ శ్రీనివాస్, డిఐ సర్వేయర్ అంబర్ సింగ్, తహసీల్దార్ కే శివప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఐకేపీ ఎపిఓ బి రాధిక, మండల సర్వేయర్ కిరణ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గుడిసె బాబు, ఆర్ ఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ప్రొటెక్షన్ మధ్య సర్వే...

పోలీస్ ప్రొటెక్షన్ మధ్య సర్వే నిర్వహించడాన్ని జంగంపల్లి గ్రామానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకుముందు సర్వే చేసి ఏం తేల్చారని, మళ్లీ ఇప్పుడు ఈ విధంగా సర్వే చేయించి ఏం తెలుస్తారంటూ గ్రామానికి చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతున్నంత సేపు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా, సర్వే జరుగుతున్న స్థలంలోకి ఎవరిని రానీయకుండా పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సర్వే నెంబర్ కు ఆనుకుని ఉన్న చుట్టుపక్కల పట్టా దారులు మాత్రం మా భూముల స్థలాలలో నుంచి ఎందుకు కొలుస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డంపింగ్ యార్డ్ మరోచోట కట్టాల్సిందేనా...?

డంపింగ్ యార్డ్ మరోచోట (ప్రభుత్వ స్థలంలో) కట్టాల్సిందేనని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 44 వ హైవే పక్కన ఉన్న 237 ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డ్ కట్టించేందుకు, ప్రస్తుత 221 సర్వేనెంబర్ పట్టాదారుడు కట్టించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నిర్ణయం తరువాతే ఎక్కడ కడతారన్నది తేలనుంది.


Similar News