చైనా మాంజా..చెక్ పడేనా..?
సంక్రాంతి పండుగ అంటేనే పిల్ల పాపలు సకల పరివారంతో ఆనందంగా గడిపే పండగ.
దిశ, నవీపేట్: సంక్రాంతి పండుగ అంటేనే పిల్ల పాపలు సకల పరివారంతో ఆనందంగా గడిపే పండగ. అటువంటి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు ఆకాశంలో ఆనందంగా గాలి పటాలను ఎగిరేస్తూ.. తమ ఆనందాలు ఆకాశానికి అందినట్లు ఆహ్లాదంలో మునిగిపోతుంటారు. పండుగకు నెలరోజుల ముందు నుండే పతంగులు ఎగరవేస్తూ..సందడి చేస్తుంటారు. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా పోటీపడుతూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అటువంటి పండుగలో అతి ప్రమాదకరంగా ఉండే చైనా మాంజా చోటు చేసుకోవడంతో పిల్లలు, పెద్దల ప్రాణాలతో చెలగాటమాడినట్లు అవుతోంది. చైనా మాంజాతో పిల్లల చేతులతో పాటు గొంతులు సైతం తెగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. గత సంవత్సరం చైనా మాంజా కోసుకుని గాయపడిన ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో కంటికి కనిపించని ‘పదునైన కత్తి’ లాంటి చైనా మాంజాకు ఓ యువకుడి ప్రాణం బలైపోయిన సంగతి తెలిసిందే.
గత నాలుగు రోజుల క్రితం నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో సైకిల్ పై వెళ్తున్న సత్యరాజ్ బాలుడికి చైనా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. చైనా మాంజా కారణంగా మనుషులే కాకుండా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల సైతం ప్రమాదాల బారిన పడుతున్నాయి. చైనా మాంజా లను ప్రభుత్వం నిషేధించిన జిల్లాలో అమ్మకాలు చేస్తుండడంతో..చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం స్పందించి చైనా మాంజాకు చెక్ పెట్టి ప్రాణాలను కాపాడాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.