ఇందూరులో అడ్డదారిలో అసైన్మెంట్ పట్టాల మార్పు..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని జిల్లా కేంద్రానికి పక్కనగల మాక్లూర్ మండలంలో అసైన్మెంట్ భూముల పట్టా మార్పిడి అడ్డదారిలో దర్జాగా జరుగుతుంది.

Update: 2024-07-09 10:51 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని జిల్లా కేంద్రానికి పక్కనగల మాక్లూర్ మండలంలో అసైన్మెంట్ భూముల పట్టా మార్పిడి అడ్డదారిలో దర్జాగా జరుగుతుంది. అసైన్మెంట్ భూముల నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారీతిగా అడ్డదారుల్లో అసైన్మెంట్ భూముల పట్టాల మార్పిడిలను టీవీగా చక్క బెడుతున్నారు. అసైన్మెంట్ నిబంధన ప్రకారం గతంలో ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన ఆ భూములను ఆ వ్యక్తులు అమ్మడం కానీ ఇతర వ్యక్తులు వాటిని కొనుగోలు చేయడం అనే విషయాలు ఉండనే ఉండవు. ఒకవేళ అసైన్మెంట్ భూమికి సంబంధించిన పట్టా దారుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పట్టాను మార్పిడి చేసే అవకాశం ఉంటుంది.

కానీ ఆర్మూర్ నియోజకవర్గంలోని జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల మాక్లూర్ మండలానికి గత ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ లో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసిన ఆ అధికారి మాక్లూరు మండలానికి తహసీల్దార్ విధులు నిర్వహించేందుకు వచ్చాడు. అసైన్మెంట్ భూములన్ని ప్రభుత్వ ఆదేశాల ఉన్నతాధికారుల సూచనల మేరకు నిషేధిత ప్రోవిడెంట్ జాబితాలో పొందుపరచబడి ఉంటాయి. కానీ మాకూరు మండలంలో సరికొత్త నిర్వచనానికి ఆ రెవెన్యూ అధికారి నాంది పలికి మామూళ్ల పర్వానికి తెర లేచినట్లు ఇందూరు జిల్లాతో పాటు ప్రత్యేకంగా మాక్లూరు మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది.

నిషేధిత జాబితాలో గల అసైన్మెంట్ భూముల పట్టాల మార్పిడికి ఒక రేటును ఫిక్స్ చేసి ఆ తహసీల్దార్ ఈ తతంగాన్ని అంత నడుపుతున్నట్లు జిల్లాలో జోరుగా చర్చనీయాంశమైంది. ఈ తతంగమంతా నడిపించేందుకు మాక్లూర్ మండలానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్మల్ నుంచి బదిలీపై వచ్చిన ఆ రెవెన్యూ అధికారి నలుగురు ఏజెంట్లతో పాటు, ముగ్గురు పాత్రికేయులను సైతం పెట్టుకున్నట్లు మాక్లూరు జనం చెవులు కొరుక్కుంటున్నారు.

నిషేధిత జాబితాలో ఉన్న అసైన్మెంట్ భూములను ఇతరుల పేరిట పట్టాలుగా మార్చాలంటే నిబంధనలను అతిక్రమించడమే అవుతుంది. కానీ మాక్లూరు మండలంలోని ఆ రెవెన్యూ అధికారికి ఈ నిబంధనలేవి వర్తించడం లేనట్లు కనబడుతుంది. దర్జాగా సాదా బయ్ నామాలకు పేరుతో అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసిన వారి పేర్ల మీద ఆన్లైన్లో పట్టా మార్పిడి చేస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా ఆ తహసీల్దార్ నలుగురి ఏజెంట్లు, ముగ్గురు పాత్రికేయులతో నడుపుతున్నట్లు మాక్లూరులో తీవ్ర చర్చ జరుగుతుంది.

ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రేటుతో ఏజెంట్ల సంప్రదింపులు..

మాక్లురు మండలంలోని మెట్ పల్లి, అమ్రాద్, చిక్లి, గుంజలి, లక్మాపూర్, ధర్మోరా గొట్టుముక్కుల, మాక్లూర్ మండల కేంద్ర శివారులలో వందల సంఖ్యలో ఎకరాల అసైన్మెంట్ భూములు కలవు. మాక్లురు మండలానికి చెందిన ఆ తహసీల్దార్ నలుగురు ఏజెంట్లు, ఇద్దరు పాత్రికేయులను మధ్యవర్తులుగా పెట్టుకొని అసైన్మెంట్ భూముల వ్యవహారాలను సెటిల్మెంట్లు చేయిస్తున్నాడు. ఒక్కో ఎకరానికి నలుగురు ఏజెంట్లు, ఇద్దరు పాత్రికేయుల మధ్యవర్తిత్వం ద్వారా లక్ష నుంచి లక్షన్నర వరకు ముడుపులు వసూలు చేస్తూ దర్జాగా అసైన్మెంట్ పట్టాలను పేర్ల మార్పిడి చేస్తు ఆన్లైన్లో ఎక్కిస్తున్నట్లు మాక్లూర్ లో చర్చ నడుస్తోంది. ఈ అసైన్మెంట్ పట్టాల పేర్ల మార్పిడి వెనుక రెవిన్యూ లో కలిగిన లొసుగులను వాడుకొని దర్జాగా కోట్ల రూపాయల డబ్బును రైతుల వద్ద నుండి మధ్యవర్తులను పెట్టుకుని వసూలు చేసినట్లు తెలిసింది.

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలం ముల్లంగి-బొంకన్ పల్లి ఎత్తిపోతల శంకుస్థాపన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లుర్ తహసీల్దార్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తహసీల్దార్ మీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. పద్ధతి మార్చుకోండి రైతులను ఇబ్బంది పెట్టవద్దు ఇది మంచి పద్ధతి కాదు అని మాక్లూర్ తహసీల్దార్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మాక్లూర్ మండలంలో సుమారు 8 నెలల వ్యవధిలో జరిగిన అసైన్మెంట్ భూముల పట్టాల పేర్ల మార్పిడిల పై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పూర్తిస్థాయి విచారణ చేయిస్తే రెవెన్యూ కార్యాలయంలో జరిగిన లీలలు బయటకు వస్తాయి.


Similar News