బీఆర్ఎస్ ది ఆత్మీయత ... కాంగ్రెస్ ది అహంకారం
బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
దిశ, బోధన్ : బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అహంకారానికి ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికలలో ఎవరు కావాలన్నది ఆలోచన చేసి ప్రజలు నిర్ణయించాలని కోరారు. బుధవారం రాత్రి బోధన్ లో నిర్వహించిన బోధన్ గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు రైతు బంధు ఇస్తుంటే రైతులకు బిచ్చం వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తు ఎందుకని... 3 గంటల విద్యుత్తు చాలదా అని అహంకారంతో అన్నారని పేర్కొన్నారు. విద్యార్థి నాయకులను అడ్డమీది కూలీలని దూషించారని అందుకే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది అహంకార పార్టీ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు గౌడ కులస్తులను విస్మరించారని, నిర్లక్ష్యం చేశారని, కల్లు అంటే ఆంధ్రా పాలకులు అవహేళన చేశారని, హైదరాబాద్ లో కల్లు దుకాణాలను మూసివేయించారని గుర్తు చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆంధ్రపాలకుల తొత్తుగా వ్యవహరించారని విమర్శించారు.
కల్లు సొసైటీలను, దుకాణాలను పునరుద్ధరించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి, ముదిరాజుల పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఒక్క రూపాయి అయినా కాంగ్రెస్ పాలనలో ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామదేవతల ఆలయాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ప్రతీ కులవృత్తిని గౌరవించుకుంటేనే సమాజం బాగుటుందన్నది సీఎం కేసీఆర్ విశ్వసిస్తారని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత చెట్లు నాటించారని తెలిపారు. జిల్లాకు 5 ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేసినా ఏకైక ప్రభుత్వం మనదేనని తేల్చిచెప్పారు. చెట్లపై పన్నును ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కల్లు దుకాణాలను పునరుద్ధరించడం వల్ల నేరుగా 70 వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని అన్నారు. సర్దార్ సర్వాయి
పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గౌడ కులస్తులకు ఆత్మగౌరవాన్ని కల్పించారని వివరించారు. సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని, బోధన్ ప్రాంతంలో అదనంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి కూడా సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బోధన్ కు వచ్చి పోతారని, షకీల్ మాత్రం స్థానికంగానే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు. షకీల్ మైనారిటీ వర్గానికి చెందినా కూడా దసరా వస్తే ఎంతో మంది హిందూ మహిళలకు చీరలను పంపిణీ చేస్తుంటారని, దీపావళి వస్తే ప్రతీ కుటుంబాన్ని పలకరిస్తారని, రంజాన్, క్రిస్మస్ పండగలనూ అంతే ఘనంగా నిర్వహిస్తారని కొనియాడారు. గంగా జమునా తెహజీబ్ ఇదేనని అన్నారు. హైదరాబాద్ కు ఈ 9 ఏళ్లలో దాదాపు 22 వేల కంపెనీలు దాదాపు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి పాలనలో కేవలం 2 బీసీ హాస్టళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 23 కుచేరుకున్నాయని, ఎంతో మంది బీసీ బిడ్డలు బాగా చదువుకోవాలన్న ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ ఇవన్నీ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, గౌడ సంఘ పెద్దలు, అధిక సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు.
రాష్టంలో బీసీలంతా ఏకం.. ఇక వార్ వన్ సైడే: బీఆర్ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్