గోల్కొండ కోటపై బీజేపీ గోల్ మాల్ తతంగం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం నడిపిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Update: 2023-06-02 11:44 GMT

దశాబ్ధి ఉత్సవాల పేరుతో బిజేపి క్షుద్ర రాజకీయం

కేసీఆర్ కుటుంబంపై విషంకక్కిన కిషన్ రెడ్డి

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం నడిపిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల పేరుతో కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి క్షుద్ర రాజకీయం చేశారని మండిపడ్డారు.

కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, పదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పకుండా కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై విషం కక్కడానికే మొత్తం సమయాన్ని కేటాయించారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఇక ముందు ఏమిస్తుందో చెప్పకుండా కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు వల్లెవేస్తూ సొల్లు పురాణం వినిపించారని ఆయన విమర్శించారు. అధికార వేదికపై ఎలా మాట్లాడాలో తెలియని అజ్ఞాని కిషన్ రెడ్డి అని, ఆయన గోల్కొండ కోటపై దర్శనమిచ్చిన గోబెల్స్ అవతారం అని అన్నారు.

కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తెలంగాణలో కనపడే టూరిస్టు అని ఆరోపించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఫ్లై ఓవర్లు ఉన్నాయో, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఎంత పంట పండుతుందో, ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో ఆయనకు తెలియదన్నారు. బీజేపీ నాయకులది చదువురాని సన్నాసుల సంఘమని ఆరోపించారు. చదువు రాని మొద్దులకు తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ దేశమే గర్వపడుతున్న నేపథ్యంలో తెలంగాణ మోడల్ గురించి రోజుకు ఒక సబ్జెక్ట్ పై వివరించే కార్యక్రమాన్ని మేం నిర్దేశించుకున్నామని తెలిపారు.

దీన్ని ఓర్వలేక బీజేపీ కొత్తగా కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. కిషన్ రెడ్డి చిత్రీకరించినట్లు తెలంగాణ అప్పుల కుప్ప కాదు, అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రం అని గుర్తు చేశారు. వాస్తవానికి బీజేపీయే దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందన్నారు. 14 మంది ప్రధాన మంత్రులు రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక్క మోడీ ప్రభుత్వమే రూ.80లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ప్రతి క్షణానికి రూ.5.34 లక్షల అప్పు చేస్తుందన్నారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని పదే పదే గొంతు చించుకుంటున్న కిషన్ రెడ్డికి ఇది కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువగా రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తూ, వడ్డీల కోసం కోట్లకు కోట్లు తగలేస్తున్నా వారికి కనిపించడం లేదని అప్పుల్లో 55 శాతం మిత్తీలకే పోతుందన్నారు. పదేళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కేంద్రానికి కనిపించలేదన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి దశాబ్ధి ఉత్సవాల పేరుతో గోల్కొండపై కాషాయ సర్కస్ కంపెనీ దిగిందని విమర్శించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్, మాజీ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నిజామాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిర్ప రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News