ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ బదిలీ పై బిగ్ ట్విస్ట్ .!

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ బదిలీ పై బిగ్ ట్విస్ట్ నెలకొంది.

Update: 2024-07-14 09:46 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ బదిలీ పై బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ ను ఈ నెల 3వ తేదీన పోలీస్ ఉన్నతాధికారి ఐజీ బదిలీ చేస్తూ ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలనే ఉత్తర్వుల ప్రతులను జారీ చేశారు. రవికుమార్ స్థానంలో భీంగల్ లో పనిచేసిన సీఐ నాగపురి శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన మళ్లీ ఆర్మూర్ ప్రస్తుత సీఐ రవికుమార్ కు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లోనే ఎస్ హెచ్ ఓ గా రీ పోస్టింగ్ ఇచ్చారు. అసలు జిల్లాలోనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ సంపాదించి విధుల్లో చేరడం అంటేనే హార్ట్ ఫేవరెట్ అనే టాక్ ఉంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం గ్రీన్ ఏరియా అని ఆర్మూర్లో నాయకులు ప్రజలు చర్చించుకోవడం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో గా పని చేస్తున్న రవికుమార్ ను బదిలీ చేసినట్లు చేసి మళ్లీ రీ పోస్టింగ్ ఇవ్వడం వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకుల హస్తం ఉందో అని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 3న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహించిన నాగపురి శ్రీనివాస్ ను ఆర్మూర్ ఎస్హెచ్వోగా బదిలీ చేస్తూ మొదట ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్ధులగుట్ట పై నాగపురి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి చార్జీ తీసుకోవడానికి ఆర్మూర్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు స్వల్ప వ్యవధిలోనే ఆర్మూర్ ఎస్ హెచ్ వో గా విధులు నిర్వహించిన రవికుమార్ ఆర్మూర్ ఏసీపీని కలిసి జిల్లా పోలీసు ఉన్నతాధికారి కల్పేశ్వర్ నుంచి తనకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుంచి రిలీవ్ కావద్దని ఆదేశం వచ్చినట్లు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డికి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఆర్మూర్ ఏసీపీ గట్టు బస్వారెడ్డిని కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆర్మూర్ నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చిన సీఐ.. ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ గా బదిలీ పై రానున్న మరో సీఐ ఇద్దరు రావడం ఆర్మూర్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

ఒకరు కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి రాగా, మరోకరు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదే స్థానంలో ఉండేందుకు వచ్చారు. పోలీస్ శాఖ అంటే ప్రధానంగా సమాజంలో శాంతి భద్రతలను రక్షిస్తూ ప్రజలకు భరోసాగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తారని జనాలు నమ్ముతారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ పదవి బాధ్యతలు చేపట్టే విషయం ఒక సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా ఉండడంతో జనం ఈ విషయం పై తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ కొనసాగించాలని పోలీస్ ఉన్నత అధికారులు తిరిగి ఆదేశాలు రావడంతో బదిలీ పై వచ్చిన సీఐ నాగపురి శ్రీనివాస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఏసీపీ కార్యాలయం నుంచి వెనుతిరిగి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓగా విధులు నిర్వహించేందుకు ఇద్దరు పోలీసు అధికారులు ఎవరికి వారే రాజకీయ పైరవీలు జోరుగా చేసినట్లు ఆర్మూర్లో జనం చర్చించుకుంటున్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ బదిలీ వ్యవహారం పై ఆర్మూర్ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. పోలీస్ శాఖలో ఒక అధికారి బదిలీ వ్యవహారం ఒకసారి ఉన్నతాధికారుల నుంచి బయటికి ఉత్తర్వులు వెలువడ్డాక తిరిగి ఆగడం అనేది సాధారణంగా ఉండనే ఉండదు. అలాంటిది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత తిరిగి అదే స్థానంలో కొనసాగేలా మరో అధికారి ఉత్తర్వులు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటనేది ఆర్మూర్ ప్రాంత ప్రజలకు అంతుపట్టడం లేదు.


Similar News